హిందుస్థాన్ యూనీలీవర్ కంపెనీ సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 3-5 శాతం మేర పెంచింది. ముడి సరకు ధరలు పెరగడం, భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ధరలను పెంచింది. దీంతో సర్ఫెక్సల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్, పేర్స్, హమామ్, లిరిల్, రెక్సోనా వంటి సబ్బుల ధరలు కూడా పెరగనున్నాయి.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ ఆయిల్ దిగుమతులపై ప్రభావం పడింది. సబ్బుల తయారీ కంపెనీలు దాదాపు పామాయిల్‌ను తమ ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తాయి. ఈ నేపథ్యంలో హెచ్‌యూఎల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపుతో సర్ఫెక్సల్ డిటర్జెంట్ కేజీ రూ.130 నుంచి రూ.134కు పెరిగింది. లక్స్ సోప్ (100గ్రాములు× 4) ఏకంగా 6.66 శాతం పెరిగి రూ.160కి చేరింది. పియర్స్ (75 గ్రాములు×3) సబ్బుల ధర సైతం 5.4 శాతం పెరిగి రూ.135కి చేరింది. ఇతర కంపెనీలు సైతం ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. బ్రిటానియా ఇండస్ట్రీస్ సైతం ధరల పెంచనున్నట్లు వెల్లడించింది.