సాధారణంగానే కొత్తగా తల్లి అయిన మహిళలు నిద్ర సమస్యతో బాధపడతారు. దీనికి ప్రధాన కారణం పుట్టిన బిడ్డను చూసుకోవడంలో ఎక్కువ టైం కేటాయించడం. ఈ నిద్రలేమి ( Sleeplessness ) కారణంగా తమ ఆయుస్సు తగ్గిపోతుందని కొందరు మహిళలు బాధపడతారు. కానీ, ఇందులో కూడా నిజం ఉందని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా దీన్ని ఓ జర్నల్లో ప్రచూరించింది.
తల్లుల గర్భధారణ సమయంతో పాటు బిడ్డకు జన్మనిచ్చిన తొలి ఏడాది వరకు మొత్తం 33 మంది 23–45 సంవత్సరాల వయసు ఉన్న తల్లులపై ఈ అధ్యయనం చేశారు. రక్త నమూనాల నుంచి తల్లుల డీఎన్ఏని విశ్లేషించి వారి ‘బయోలాజికల్ ఏజ్‘ ను గుర్తించారు. 6 నెలల పాటు రాత్రి ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయిన తల్లుల బయోలాజికల్ వయస్సు 3–7 ఏళ్లు ఎక్కువగా కనిపించినట్లు గుర్తించారు. ఏడు గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిద్రపోయిన తల్లులతో పోల్చితే వీరి వయస్సు పెరిగింది.
ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే తల్లుల తెల్ల రక్తకణాల్లో టెలోమీర్ల పొడవు తగ్గుతుందని, ఇవి కుచించుపోవడం వల్ల కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో మరణాల ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎదుర్కొనే నిద్రలేమి వల్ల శారీరక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుందని అధ్యయన బృంద సభ్యులు చెప్పారు. శరీరానికి వ్యాయామం, పోషకాహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమని ఇతర స్లీప్ సైంటిస్టులు కూడా పరిగణించారని చెప్పారు. అయితే, తాము కేవలం చాలా తక్కువ మంది మహిళలపై అధ్యయనం చేశామని.. దీర్ఘకాలిక ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెప్పారు.