ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు అంతే వేగంగా స్పందించే శారు. తాజాగా కాకినాడలో పర్యటించిన పవన్.. అక్కడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తదనం తరం జనసేన కార్యకర్తల హల్‌చల్.. ఆ తర్వాత జరిగిన రగడ నేపథ్యంలో గాయపడిన జనసేన కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఆయన జగన్ ప్రభుత్వం పై ఎలాంటి అవకాశం వచ్చినా విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అడగకుండానే వచ్చిన అవకాశాన్ని వదిలేయరు కదా! దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
అయితే, ఈ దఫా ఆయన భవిష్యవాణిని వినిపించారు. గతంలోనే అంటే 2014 ఎన్నికలకు ముందుగానే తాను భవిష్యత్తు ఏంటో చెప్పానని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వస్తే.. అరాచకాలు జరుగుతాయని, పాలెగాళ్ల రాజ్యం వస్తుందని, అక్రమాలు, నిర్బంధాలు పెరుగుతాయని చెప్పానని అన్నారు. అందుకే జగన్‌ను గెలిపించొద్దని తాను చెప్పానని, అయినా కూడా ప్రజలు తన భవిష్య వాణిని పట్టించుకోకుండా జగన్ గెలిపించారు కాబట్టి అనుభవించండని ముక్తాయించారు.
ఇక, అదేసమయంలో తన పార్టీ కార్యకర్తల జోలికి వస్తే.. తాట తీస్తానని, డోలు కడతానని మళ్లీ పాడిందే పాట పాడేశారు. ఇలా పవన్ వ్యాఖ్యలు చేశారో లేదో.. అలా నెటిజన్లు కామెంట్లు కుమ్మరించారు. ఇంత భవిష్య వాణి తెలిసిన పవన్.. తన పార్టీ ఈ ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోతుందని తెలుసుకోలేదా? అని ప్రశ్నించేశారు. అంతేకాదు, భవిష్యవాణి ఒక్క జగన్‌కే పరిమితమా? చంద్రబాబు గురించి కూడా కొద్దిగా హెచ్చరించి ఉంటే.. ఎన్నికలకు ముందు ఆయన రూ.2 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చి మరీ పసుపు-కుంకుమ పేరుతో విడతల వారీ విదిలింపులు ఆపేవారు కదా? తమపై భారం కూడా తప్పేది కదా? అని ఊపిరి సలపనివ్వని విధంగా ప్రశ్నల వర్షం కురిపించేశారు.
ఇక, ఇక్కడితో ఊరుకోలేదు.,. భవిష్యవాణిపై పట్టున్న పవన్.. తన ఏకైక ఎమ్మెల్యే వర ప్రసాద్ పార్టీలో ఉంటారా? జంప్ చేస్తారా? లేక టీడీపీ ఎమ్మెల్యేల మాదిరిగా తటస్థంగా మారి కొత్త రాజకీయాలకు తెరదీస్తారా అనే విషయాన్ని కూడా కొంచెం చెప్పేస్తే.. సంతోషిస్తామని అంటున్నారు. మరికొందరు.. వచ్చే ఎన్నికల్లో అయినా జనసేన అధికారంలోకి వస్తుందో లేదో చెప్పాలన్నారు. మరికొందరు గడుసుగా.. అసలు పార్టీ అప్పటి వరకు ఉంటుందో లేదో క్లారిటీ ఇవ్వండి మహాప్రభో అన్నారు. మొత్తానికి భవిష్యవాణి చెప్పే పవన్ ఇలా ప్రశ్నల పరంపరలో చిక్కకుని అల్లాడిపోతున్నారు. మరి వీటికి ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.