ఆంధ్రావనిలో చదువులు వెనుకబడిపోయాయి అని అనేందుకు తాజా టెన్త్ ఫలితాలే ఓ ఉదాహరణ. అయితే గతంలో కన్నా ఇప్పుడు పరీక్షలకు హాజరయ్యే తీరు, పాఠ్యాంశాల నడవడి, టెక్ట్స్ బుక్ ఉన్న తీరు వీటన్నింటిపై కూడా తల్లిదండ్రులకు కూడా అవగాహన ముఖ్యం. మారుమూల ప్రాంతాల్లో చదువులు అన్నవి అత్తెసరుగానే సాగేయి ఈ మూడేళ్లూ. ఎందుకంటే కరోనా కారణంగా రెండేళ్లు అస్సలు బడిముఖం చూడని విద్యార్థులు ఏ విధంగా నాణ్యత ప్రమాణాలను లేదా ఇంటర్నల్ స్కిల్స్ ను పెంపొందించుకోగలరు? అన్నది ఓ ప్రశ్న.
మరోవైపు పోటీ ప్రపంచంలో కాస్తో కూస్తో ప్రయివేటు బడులు ఆన్లైన్ క్లాసులు కానీ వీడియో పాఠాలు కానీ చెప్పాయి. కానీ ఇక్కడ ఆ సౌకర్యం లేనే లేదు. ఉన్నా కూడా అక్కడక్కడా అంతంత మాత్రమే ! అది కూడా మాస్టారి అంకిత భావం ఉంటేనే ఆ పాటి అయినా సాధ్యం అయి ఉండేది. ఇప్పుడు తక్కువ మార్కులు, తక్కువ శాతం ఉత్తీర్ణత గురించి మాట్లాడే బదులు ముందుగా టీచర్ కు ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించి ఎంత కాలం అయింది. టీచింగ్ ఎయిడ్ అందించి ఎంత కాలం అయింది? అన్నవి కూడా ప్రశ్నించుకోవాలి. ఇవేవీ లేకుండా ఓటమికి ఒక్కరిదే బాధ్యత అని అనకూడదు. అయితే ప్రభుత్వ సారథిగా జగన్ ఈ బాధ్యతను మోయాల్సి ఉన్నా, మిగతా కారణాలనూ తదుపరి ఫలితాలనూ కూడా విశ్లేషిస్తూ వెళ్లాలి. అప్పుడే కాస్తయినా విద్యా వ్యవస్థలో ఉన్న అస్తవ్యస్తతను అర్థం చేసుకోగలం.
పిల్లల చదువులకు సంబంధించి ఇప్పుడంతా మాట్లాడుతున్నారు. చాలా మంది నలభై శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలో కూడా చాలా అంటే చాలా అంతర్మథనం సాగుతోంది. మరోవైపు జూలై ఆరు నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు అధికారులు. ఈ నేపథ్యాన ఈ ఓటమికి కారకులెవ్వరు ?
ముఖ్యంగా ఇంగ్లీషు మీడియం చదువులే ప్రామాణికం, వాటితోనే వెలుగు, వాటితోనే భవిత అని పేర్కొంటూ చాలా చోట్ల తెలుగు మాధ్యమంలో బోధన అన్నది విస్మరించారు. పోనీ ఆ స్థాయిలో అన్ని చోట్లా బోధన జరిగిందా అంటే అదీ లేదు. కరోనా కారణంగా రెండేళ్లు పిల్లల చదువులు ఏమాత్రం ముందుకు వెళ్లలేదు. వాటిపై అయినా దృష్టి ఉందా అంటే అదీ లేదు. ఇక ఉపాధ్యాయుల సంగతి సరేసరి ! చాలా చోట్ల వారి నిబద్ధత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓ విధంగా ఈ ఫలితాల కారణంగా మన వ్యవస్థలో మేల్కొల్పు వస్తే మేలు. ఈ ఓటమి ఎవరిది ? ఓ సారి ఆలోచిద్దాం.ఆరాతీద్దాం.
చాలా రోజుల తరువాత అంటే గ్రేడింగ్ సిస్టమ్ తరువాత మార్కుల ప్రకటన అన్నది యువ ముఖ్యమంత్రి జగన్ చేశారు. అయితే ర్యాంకుల గోల అన్నది లేకుండా కూడా చేశారు. ఓ విధంగా ఇది కూడా మంచిదే ! అయితే ఆయన విద్యా వ్యవస్థను సక్రమంగా న డిపించలేకపోతున్నారు అన్న వాదన మాత్రం ఉంది. ఎందుకంటే నాడు – నేడు పేరిట బడులు కొన్ని బాగు పరిచినా, చదువుల నాణ్యత అయితే మెరుగుపడలేదు.
ముఖ్యంగా టీచర్లంతా పీఆర్సీల ఉద్యమాలకు ప్రాధాన్యం ఇచ్చారే కానీ చదువులలో నాణ్యతను పెంచే క్రమానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. విద్యార్థులు కూడా ఈ సారి పరీక్షలపై పెద్దగా శ్రద్ధ చూపించలేదు అన్న విమర్శ కూడా ఉంది. ఆన్లైన్ చదువులు రెండేళ్లు సాగించాక వీళ్లంతా బడి బాట పట్టారు కానీ అక్కడ వీళ్లు తరగతులను, వాటి నిర్వహణను సరిగా అర్థం చేసుకోలేదు. మరీ ! ముఖ్యంగా ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసేందుకు వారికి కావాల్సినంత పరిజ్ఞానం అయితే లేకుండా పోయింది. ఇవన్నీ ఓటమికి కారణాలే..! విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యం నింపే విధంగా ఇప్పటికైనా చర్యలు చేపడితే, మంచి బోధన అన్నది అందుకు మార్గ దర్శకత్వం చేస్తే మేలు.