బల్దియా ఎన్నికల ప్రచారంలో స్టైల్‌ మారిందా ?

-

ఎలక్షన్‌ ఏదైనా.. రంగు రంగుల జెండాలు… చుట్టూ కార్యకర్తలు.. మెడలో కండువాలు.. జిందాబాద్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు.. హోరెత్తించే మైకులు.. ఫ్లెక్సీలు, కటౌట్లు…! ఒకటే హడావిడి. ఇదంతా ఒకప్పుడు. ట్రెండ్‌ మారింది. టెక్నాలజీలో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న తరుణంలో… బల్దియా ఎన్నికల ప్రచారం స్టైల్‌ కూడా మారింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ గ్రూప్స్‌… దేన్నీ వదలకుండా వీడియోలు, మెసేజ్‌లు, గ్రాఫిక్స్‌తో టెక్‌ప్రచారంతో దూసుకుపోతున్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్‌, వాట్సప్‌… నేటి తరం జపిస్తున్న తారక మంత్రం. నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు నెట్‌ ప్రపంచంలో గింగిరాలు కొడుతున్నారు. ఓ పూట భోజనం చేయకుండా ఐనా ఉంటున్నారేమో కానీ… సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టనిదే పూట కూడా గడవట్లేదు. స్మార్ట్‌ ఫోన్ల రాకతో.. ఒక్క క్లిక్‌తో ప్రపంచాన్నే చుట్టేస్తున్నారు.

మంచైనా చెడైనా… సమాచారమైనా విశ్లేషణ ఐనా.. పోస్ట్‌కు కాదేది అనర్హమన్నట్టు… తోచిందల్లా ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో పోస్ట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఏ విషయమైనా… క్షణాల్లో ఖండాంతరాలు దాటేలా చేస్తోంది సోషల్‌ మీడియా. మరి అలాంటి సోషల్‌ మీడియా… ఇప్పుడు ఎన్నికల ప్రాచారాల్లోనూ కీ రోల్‌ అయ్యింది. తమ పార్టీ నేత మాట్లాడిన కొన్ని క్షణాల్లోనే వీడియో సోషల్‌ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఫొటోలు.. వీడియోలతో సోషల్‌ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్స్‌ నూ తెగవాడేసుకుంటున్నారు.

పార్టీ జెండాలు.. నినాదాలతో హోరిత్తించే కార్యకర్తలు, మైకులు, అడుగడుగునా ఫ్లెక్సీలు, కటౌట్లు.. ఇవి ఒకప్పటి ఎన్నికల ప్రచారాస్త్రాలు. ట్రెండ్‌ మారింది. స్మార్ట్‌ యుగంలో ప్రచార శైలీ మారింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, వాట్సప్‌ గ్రూప్స్‌, మెసెంజర్‌… ఇలా అన్ని మాద్యమాలనూ వాడేసుకుంటున్నారు. తాజాగా బల్దియా ఎన్నికల్లోనూ సోషల్‌ మీడియా క్యాంపెయినింగ్‌ జోరుగా కనిపిస్తోంది.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవ్వకముందు నుంచే సోషల్‌ మీడియా లో ప్రచారం మొదలైంది. టెకెట్‌ ఆశావాహులు.. వారి అభిమానులు… పార్టీ కార్యకర్తలు… రకరకాల వీడియోలు, ఫొటోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రొటీన్‌కి భిన్నంగా సెటైరికల్‌ కామెంట్స్‌.. ట్రోలింగ్స్‌.. గ్రాఫిక్‌ వీడియాలు.. సినిమాటిక్‌ ఎడిటింగ్‌తో అధరగొడుతున్నారు.
ఇలా మంత్రి కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడతాడో లేదో… క్షణాల్లోనే అభిమానులు వీడియో క్లిప్పింగ్‌లను సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ వెంటనే ఇతర పార్టీలు ఆ వీడియోలను సెటైరికల్‌గా ఎడిట్‌ చేసి పోస్ట్‌ చేయడం… వీళ్లిద్దరికీ కౌంటర్‌గా మరో పార్టీ అభిమానులు… ఇలా.. క్షణాల్లో సోషల్‌ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news