విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష అభియాన్ లో భాగమే అన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. నాడు – నేడు నిధుల్లో కేంద్రం వాట ఉందని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న తీరు మారాలని సూచించారు. అలాగే తెలంగాణ రాజకీయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు.
వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి విఆర్ఎస్ ఇవ్వడం ఖాయం అన్నారు. బీసీలు తెలంగాణను విడిచి పోయేలా సీఎం కేసీఆర్ వైఖరి ఉందని విమర్శించారు. తెలంగాణలో చాలామంది బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆరోపించారు. ఆంధ్ర ప్రజలను ద్వేషించిన వ్యక్తికి జాతీయ పార్టీ పెట్టే హక్కు లేదన్నారు సోము వీర్రాజు.