శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప అమీన్ పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి.. ప్రభుత్వ లాంఛనాలతో పూల చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు.. జిల్లా ఇంచార్జి మంత్రి ఆది మూలపు సురేష్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, కడప నగర పాలక కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్,వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… “మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని ఆనంద పరవశులయ్యారు. ఈ దర్గా ఖ్యాతీ, మహిమలు.. ప్రపంచ వ్యాప్తంగా పరిమళిస్తున్నాయంటే.. కులమత తేడాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా భాగస్వామ్యం కావడమే ప్రధాన కారణం అన్నారు. తను పుట్టిన సొంత జిల్లాలో.. ఇలాంటి మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
అంతకు మించి ఆమీన్ పీర్ దర్గాను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదరిస్తున్న జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో.. అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందివ్వగలుగుతున్నామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తూ.. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా మైనారిటీ ప్రజల సేవలో తరిస్తున్న.. మిత్రుడు ఎస్.బి.అంజాద్ బాషాకు అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు.