కాంగ్రెస్ అగ్రనేత, రాయ్‌బరేలీ ఎంపీ సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతి ఇన్ఫెక్షన్ సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరారు. శనివారం రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి వెళ్లారు. ఛాతి ఇన్ఫెక్షన్‌తోపాటు ఆమె జ్వరంతో కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనియా గాంధీకి సర్ గంగారాం ఆస్పత్రి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ఏడాదిలో సోనియా ఇప్పటికే రెండుసార్లు ఇదే ఆసుపత్రిలో చేరారు. వైరల్ శ్వాసకోస ఇన్ఫెక్షన్‌తో ఈ ఏడాది జనవరి 12న ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజుల తర్వాత 17న ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత మార్చి 2న జ్వరంతో అదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ తర్వాత కోలుకున్న ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 31న ముంబైలో నిర్వహించిన ఇండియా కూటమి సమావేశంలో కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. అంతలోనే ఆమె మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.