సోనూకు అరుదైన గౌరవం.. నవరాత్రి మండపంలో విగ్రహం

లాక్‌ డౌన్ వల్ల ఇబ్బందులు పడ్డ కార్మికులను ఆదుకున్న సోనూ సూద్‌ కు మంచి పేరు వచ్చింది. కోట్లకు కోట్లు సంపాదించుకున్న హీరోలు కూడా చేయని సాయం చేశారు. ఆయనకు ఇప్పటికే చాలా చోట్ల చాలా మంది చాలా రకాలుగా గౌరవించారు. తాజాగా ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన మండపంలో కొందరు భక్తులు ఆయన‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌ లోని కోల్‌‌కతాలో ప్రఫుల్లా కనక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన నవరాత్రి మంటపంలో సోనూ సూద్‌ విగ్రహాన్ని పెట్టారు. ఆయన కార్మికులకు చేసిన సాయాన్ని తెలిపేలా కార్మికులు, బస్సుల బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు అక్కడి నిర్వాహాకులు. ఇందుకు సంబంధించిన ఫొటోను కొందరు ట్విట్టర్ లో పోస్ట్ చేయగా దాని మీద సోనూ సూద్‌ కూడా స్పందించాడు. తనకు జీవితంలో లభించిన అతిపెద్ద పురస్కారం ఇదేనని ఆయన పేర్కొన్నాడు.