డ్రైవింగ్ లైసెన్స్​ కోసం 960సార్లు పరీక్ష రాసి.. రూ.11 లక్షలు ఖర్చు చేసి.. చివరకు

-

ఆడవాళ్లు వాహనాలు నడుపుతుంటే ఇప్పటికీ కొంతమంది కామెంట్లు చేస్తుంటారు. ఆడవాళ్లకు డ్రైవింగ్ గురించి ఏం తెలుసంటూ ఈజీగా కొట్టిపారేస్తుంటారు. ఇలాంటి వాళ్ల నోళ్లు మూయించాలని.. ఓ మహిళ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంది. అనుకున్నట్లుగా నేర్చుకుంది. ఇక డ్రైవింగ్ లైసెన్సు పొందడమే తరువాయి. అయితే ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్​ అంత ఈజీగా రాలేదండోయ్. దాని కోసం ఏకంగా 960 సార్లు పరీక్ష రాసింది. ఏకంగా రూ.11.16 లక్షలు ఖర్చు చేసింది. ఇంతకీ ఆమె ఎవరు..? ఆ కథేంటో తెలుసుకుందామా..?

దక్షిణ కొరియాకు చెందిన చా సా-సూన్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం తొలిసారిగా 2005లో రాత పరీక్ష రాసి ఫెయిల్‌ అయింది. ఆ తర్వాతి రోజు నుంచి వారానికి ఐదు రోజుల చొప్పున మూడేళ్లలో 780 సార్లు పరీక్ష రాసింది. కానీ ఆమెకు నిరాశే ఎదురైంది. అయినా పట్టువదలకుండా ఈసారి వారానికి రెండుసార్ల చొప్పున ఏడాదిన్నరకు పైగా ప్రయత్నాలు చేసింది. చివరకు ప్రాక్టికల్‌ టెస్టుకు ఎంపికైంది. పది సార్లు ప్రయత్నించి ప్రాక్టికల్‌ టెస్టులోనూ పాసైంది. మొత్తంగా 960 ప్రయత్నాల తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందింది. అప్పటికి ఆమె వయసు 69 ఏళ్లు. ఈ క్రమంలో దాదాపు 11 వేల పౌండ్లు (రూ.11.16లక్షలు) వెచ్చించింది.చా సా-సూన్‌ పట్టుదలను మెచ్చిన హ్యుందాయ్‌ సంస్థ ఓ కారును బహూకరించింది. ఇది 18 ఏళ్ల కిందటి సంగతైనా ఇటీవల ఓ వ్యక్తి సామాజిక మాధ్యమం రెడిట్‌లో పంచుకోవడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news