“మన కలలు మనమే సాకారం చేసుకోవాలి.. మన కలలు ఎదుటివారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం.. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం కన్న కల అమరావతి.. అది సాకారం అవ్వాలంటే 2024లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి.. ఆ దిశగా పార్టీలో అందరూ కష్టపడి పని చేయాలి.. మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనల వల్ల ప్రయోజనం లేదు” ఇది తాజాగా కేశినేని నాని ట్వీట్! దీంతో… అసలు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు అనేదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది!
“మన కలలను ఎదుటివారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం” అనే మాట… చంద్రబాబుని ఉద్దేశించి అని ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజంగా అమరావతి అనేది బాబు కలే అయితే… దాన్ని ఉన్న ఐదేళ్లలో ప్రతిపక్షాల నోర్లు మూయించేలా ఎంతో కొంత ఒక రూపు తీసుకువచ్చి ఉండేది. కానీ… బాబు అలా చేయలేదు, సరికదా జగన్ చేయాలని కోరుకుంటున్నారు.. అన్నట్లుగా ఉందనేది పలువురి అభిప్రాయంగా ఉంది!
ఇక …”2024లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి.. ఆ దిశగా పార్టీలో అందరూ కష్టపడి పని చేయాలి” అని అనే మాట విషయంలో… హోం క్వారంటైన్ పేరు చెప్పి చంద్రబాబు – లోకేష్ లు భాగ్యనగరంలో తలదాచుకుంటే ప్రయోజనం శూన్యం.. జనాల్లోకి రావాలి అనేది ఆయన ఉద్దేశ్యం అయ్యి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు!
ఇక “మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనల వల్ల ప్రయోజనం లేదు” అని చెప్పే మాట చంద్రబాబు ఆన్ లైన్ ముచ్చట్లు.. కొందరు టీడీపీ నేతల ప్రెస్ మీట్లు.. టీవీ డిబేట్లలో గొంతేసుకుని పడిపోవడాలవల్ల ప్రయోజనం లేదని… నేరుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేస్తే ఫలితం ఉంటుందని చెప్పినట్లుగా ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు!
ఏది ఏమైనా… కేశినేని నాని కాస్త ధైర్యం చేసి “బాబు & కో” లకు కాస్త గట్టిగానే సూచనలతో కూడిన చురకలు అంటించారనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి!!