జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన ప్రచార రథానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి మాట్లాడారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విడిపించడమే జనసేన ప్రచార రథం వారాహి లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు ముందుండాలని తాను కోరుకుంటానని చెప్పారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉంటుందన్నారు. ప్రచార రథానికి పూజ చేసేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానని పవన్ చెప్పారు.
రాష్ట్రంలో జరిగే అరాచకాలు అమ్మవారు చూస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా, మంగళవారం కొండగట్టు, ధర్మపురిలో వారాహికి పవన్ ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. అయితే, కొండపైకి వారాహి వాహనానిని అధికారులు అనుమతించకపోవడంతో ఘాట్ రోడ్ లోని అమ్మవారి విగ్రహం ముందు పూజలు చేశారు. జనసేనాని వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని కూడా లోపలికి అనుమతించలేదు. కాగా, పవన్ రాక నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి, ఘాట్ రోడ్ కు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. పవన్ కు ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ ను, వారాహి వాహనానికి గజమాల వేసి సత్కరించారు. ప్లై ఓవర్ పై నుంచి పవన్ పై పూల వర్షం కురిపించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయంలోపలికి వెళ్లిన పవన్ వెంట కొంతమంది ముఖ్యనేతలను మాత్రమే అధికారులు అనుమతించారు.