వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ కోసం భారత టెస్టు క్రికెట్ జట్టు ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఉన్న విషయం విదితమే. న్యూజిలాండ్‌తో భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఆడనుంది. ఆ తరువాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఉంటుంది. దీంతో భారత పరిమిత ఓవర్ల జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ క్రమంలోనే ఆ జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనుండగా ఆ జట్టు శ్రీలంకతో మొత్తం 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.
కాగా శ్రీలంకతో ఆడుతుండడం భారత యువ ఆటగాళ్లకు లభించిన చక్కని అవకాశం అని చెప్పవచ్చు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న చాలా మంది యువకులు ఈ జట్టులో ఆడుతున్నారు. దీంతో వారు త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ శకారియాలు ఇటీవల ఐపీఎల్‌లో రాణించారు. దీంతో జాతీయ జట్టులో ఆడే అవకాశం లభించింది. అయితే వీరు శ్రీలంకతో ఎలా ఆడుతారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఇక శ్రీలంక విషయానికి వస్తే వారు గత కొన్నేళ్లుగా అంత సక్సెస్ సాధించడం లేదు. గత నెలలో వారు బంగ్లాదేశ్‌కు ప్రయాణమయ్యారు. అక్కడ ఆ జట్టుతో 1-2 తేడాలో వన్డే సిరీస్‌లో ఓడారు. అయితే వారు భారత్ కన్నా ముందుగా ఇంగ్లండ్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు ఆరు ఆడనున్నారు. దీంతో వారు భారత్ తో సిరీస్ ఆడే వరకు ఏమైనా మెరుగు పడతారేమో చూడాలి.
జట్ల వివరాలు ఇలా ఉన్నాయి
భారత్ – శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతు రాజ్ గైక్వాడ్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కె.గౌతమ్, క్రునాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ శకారియా
శ్రీలంక – జట్టు వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది
శ్రీలంక వర్సెస్ ఇండియా షెడ్యూల్
* జూలై 13 – మొదటి వన్డే – మధ్యాహ్నం 2.30 గంటలకు
* జూలై 16 – రెండో వన్డే – మధ్యాహ్నం 2.30 గంటలకు
* జూలై 18 – మూడో వన్డే – మధ్యాహ్నం 2.30 గంటలకు
* జూలై 21 – తొలి టీ20 – రాత్రి 7 గంటలకు
* జూలై 23 – రెండో టీ20 – రాత్రి 7 గంటలకు
* జూలై 25 – మూడో టీ20 – రాత్రి 7 గంటలకు
మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి. సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. సోనీ లివ్ యాప్‌లో ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లను చూడవచ్చు.