కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్ జరగదనే అనుకున్నారు. కానీ ఆలస్యమైనా సరే క్రికెట్ అభిమానులకి వినోదం అందించడానికి ఐపీఎల్ మొదలైంది. ఐతే కోవిడ్ వల్ల ఎన్నో కఠిన నిబంధనల మధ్య ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. మైదానంలో ప్రేక్షకుల్లేకుండా, మ్యాచు ముగిసిన తర్వాత ఇంటర్వ్యూ చేయడానికి మీడియా లేకుండా, కేవలం ఖాళీ మైదానాల్లో రెండు జట్లు మ్యాచులు ఆడుతున్నాయి.
ఐతే ప్రేక్షకుల్లేకుండా మ్యాచులు ఆడడం ఆటగాళ్లపై చాలా ప్రభావం చూపిస్తుందని, ప్రేక్షకులు లేకపోవడం వల్ల ఆటలో ఎమోషన్ మిస్ అవుతుందని రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ తెలిపాడు. స్టేడియం నిండా జనం ఉండి, మ్యాచు గెలుస్తామా లేదా అన్న సంధిగ్ధంలో ఉన్న టైమ్ లో ప్రేక్షకుల నుండి వచ్చే ఎనర్జీ ఆటలో చాలా ఉపయోగపడుతుందని, అదీగాక ఆటగాడిపై అది కొంత ఒత్తిడిని కలిగించి మరింత బాగా ఆడే అవకాశం ఉంటుందని చెబుతున్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచుల్లో ఆ ఎమోషన్ మిస్ అవుతుందని, అందువల్ల పరిస్థితులు మెరుగుపడితే గనక కొద్ది పాటి మందికైనా మైదానంలోకి అనుమతించాలని కోరుతున్నాడు. టోర్నమెంట్ ద్వితీయార్థంలో ఈ విధంగా చేస్తే మ్యాచుల్లో మరింత మజా వచ్చే అవకాశం ఉందని అంటున్నాడు. చూడాలి మరేం జరగనుందో..!