దుబాయ్‌లో గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 క్వాలిఫైర్ 1 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ అలవోకగా విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ ఈ సారి కూడా ఫైనల్స్‌కు చేరుకుంది. ముంబై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ తడబడింది. దీంతో ఆ జట్టుపై ముంబై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్వింటన్ డికాక్‌లు రాణించారు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో కిషన్ 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో యాదవ్ 51 పరుగులు చేశాడు. డికాక్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులు చేయగా, చివర్లో హార్దిక్ పాండ్యా 14 బంతుల్లో 5 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. నోర్‌జె, స్టాయినిస్‌లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో స్టాయినిస్, అక్షర్ పటేల్ మినహా ఎవరూ రాణించలేదు. 46 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో స్టాయినిస్ 65 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అలాగే ట్రెంట్ బౌల్ట్‌కు 2, కృనాల్ పాండ్యా, పొల్లార్డ్‌లకు చెరొక వికెట్ చొప్పున దక్కాయి. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫైనల్స్ కు చేరుకునేందుకు మరొక అవకాశం ఉంది. ఆ జట్టు గురువారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుతో క్వాలిఫైర్ 2 మ్యాచ్‌ను ఆడనుంది. గురువారం రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అబుధాబిలో జరగనుంది.