ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఆలస్యంగా జరిగినప్పటికీ గ్రాండ్‌గా ముగిసింది. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్ కు, ఢిల్లీ క్యాపిటల్స్ కు మధ్య జరిగిన పోరులో ముంబై అలవోకగా గెలిచి ట్రోఫీని 5వ సారి ముద్దాడింది. అయితే వచ్చే ఐపీఎల్ అనుకున్న తేదీకే జరుగుతుందని ఇది వరకే ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. దీంతో వచ్చే సీజన్ మరికొద్ది నెలల్లోనే జరగనుంది. అయితే ఆ సీజన్ కోసం ఓ కొత్త జట్టును తెరపైకి తెస్తున్నట్లు తెలిసింది.
ఐపీఎల్ 2021లో ఓ కొత్త జట్టు బరిలోకి దిగుతుందని వార్తలు వస్తున్నాయి. అహ్మదాబాద్ పేరిట ఆ జట్టును అందుబాటులో ఉంచుతారని, దాని కోసం ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయని తెలిసింది. ఇక వచ్చే సీజన్ ఏప్రిల్‌లోనే భారత్‌లోనే జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈసారి వేలం పాటను కూడా బీసీసీఐ నిర్వహించాలని చూస్తున్నట్లు తెలిసింది.
వచ్చే ఐపీఎల్‌కు గాను బీసీసీఐ మొదటగా కొద్ది మొత్తం ప్లేయర్లకు చిన్న మొత్తంలో వేలం పాట నిర్వహించాలని అనుకున్నట్లు తెలిసింది. కానీ పూర్తి స్థాయిలో ప్లేయర్లందరికీ మళ్లీ వేలం నిర్వహిస్తుందని సమాచారం. అయితే వేలం ఎప్పుడు ఉంటుంది ? ఈ సారి కొత్త టీం ఐపీఎల్‌లో దర్శనమిస్తుందా ? అన్న వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వేచి చూడక తప్పదు.