రోహిత్ శర్మ ఎమోషనల్ ట్వీట్

జూన్ 23.. ఈ రోజు రోహిత్ శర్మ కు ఒక ప్రత్యేకమైన రోజు. అది ఏంటంటే ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన రోజు. 2007 జూన్ 23న బెల్ ఫాస్ట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. తాజాగా నేటితో 15 ఏళ్ల క్రికెట్ కెరీర్ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

” ఈరోజుతో 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను పూర్తి చేసుకున్నా. ఇన్నేళ్ల నా ప్రయాణం లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధురానుభూతులు.. ఒడిదుడుకులు, చీకటి రోజులు ఉంటాయి. కానీ వాటన్నింటినీ అధిగమిస్తూ ఈ స్థాయికి చేరుకున్నాను అంటే దానికి మీ అందరి సపోర్ట్ ఒక కారణం. అందుకే నా ప్రయాణం లో మద్దతుగా నిలిచిన క్రికెట్ లవర్స్, అభిమానులకు, విమర్శకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నా”. అని అన్నారు.