టీమిండియాకు షాక్‌… ఇంగ్లాండ్‌ సిరీస్‌కు మరో ఆటగాడు దూరం

భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ఇంకా ప్రారంభం కాకముందే ఆటగాళ్ళు క్రమంగా గాయాల బారిన పడుతుండడం జట్టును కలవరపెడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా శుభ్‌మన్‌గిల్‌, అవేశ్‌ ఖాన్‌ ఈ సిరీస్‌కు దూరమవగా తాజాగా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ సిరీస్‌ నుంచి వైదొలిగాడు. భారత్, కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సుందర్‌ గాయపడ్డాడు.

ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సుందర్‌ కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌ తరఫున బరిలోకి దిగాడు. అయితే సిరాజ్‌ వేసిన బంతి సుందర్‌ చేతి వేలికి తగలడంతో అతనికి గాయమైంది. కనీసం అతడికి ఐదువారాల విశ్రాంతి అవసమున్నట్లు సమాచారం. దీంతో సుందర్‌ ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండడం అనుమానమే. కాగా సుందర్‌ 2018లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇలానే గాయపడి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే ఇంటిముఖం పట్టాడు. తాజాగా రెండోసారి కూడా ఇలా జరగడం గమనార్హం.

డర్హమ్‌ వేదికగా భారత్, కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రోహిత్‌ నేతృత్వంలోని భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా కౌంటీ జట్టు 220 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ 192/3 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా… చివరి రోజైన మూడో రోజు కౌంటీ సెలక్ట్ ఎలెవన్‌ జట్టు వికెట్‌ నష్టపోకుండా 31 పరుగులతో నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.