ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని రెండు వరుస పరాజయాలతో మొదలెట్టింది ఆస్ట్రేలియా. శ్రీలంకపై గెలిచి బోణీ కొట్టిన ఆస్ట్రేలియా, బెంగళూరులో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్, బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ మొదటి బంతికే డేవిడ్ వార్నర్ అవుట్ కోసం రివ్యూ కోరుకుంది పాకిస్తాన్..
అయితే రిప్లైలో బంతి, బ్యాటుకి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో రివ్యూ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ని ఉసామా మిర్ జారవిడిచాడు. అప్పటి నుంచి పాకిస్తాన్‌కి అవకాశం ఇవ్వకుండా బౌండరీల మోత మోగించారు ఆస్ట్రేలియా ఓపెనర్లు.
మరోవైపు ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ మెయిడిన్ ఇచ్చాడు. 7 ఓవర్లు ముగిసే సమయానికి 37 పరుగులే చేసిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత స్పీడ్ పెంచింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్, మార్ష్ వీరవిహారం చేస్తున్నారు. ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. తొలుత వార్నర్ 82 బంతుల్లో శతకం బాదగా.. ఆ తరువాత బంతికే మార్ష్ ఫోర్ బాది సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఆసీస్ 33 ఓవర్ల వరకు వికెట్ కోల్పోలేదు. 33.5 ఓవర్లకు తొలి వికెట్ ని సమర్పించుకుంది ఆస్ట్రేలియా. ఆ తరువాత బంతికే మాక్స్ వెల్ ఇలా వచ్చి అలా డక్ ఔట్ అయ్యాడు. వార్నర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు.