చెన్నై సూపర్ కింగ్స్ అనగానే గుర్తొచ్చేది ఎంఎస్ ధోని. ఈ జట్టు కెప్టెన్గా ధోని సాధించిన విజయాలు చిరకాలం నిలిచిపోతాయి. అయితే ధోని సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తాజాగా వైదొలగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక్క రోజు ముందు ధోనీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. సీఎస్కే నూతన కెప్టెన్గా రుతురాజ్ ఎంపికయ్యాడు. అయితే ధోనీ నిర్ణయంపై ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
ధోని నిర్ణయం వెలువడిన కాసేపటికే అతడితో ఉన్న బంధాన్ని రోహిత్ తన ఇన్‌స్టా అప్‌డేట్‌లో ఓ ఫొటోతో పంచుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇరువురూ చేయి చేయి కలుపుతున్న దృశ్యాన్ని షేర్ చేసి కింద షేక్‌హ్యాండ్ ఎమోజీని యాడ్ చేశాడు. మరోవైపు ఈ సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మరోవైపు టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం ధోని నిర్ణయంపై స్పందించాడు. కెప్టెన్ కూల్ నాయకత్వం దశాబ్దాలపాటు నిలిచిపోతుందని ప్రశంసల వర్షం కురిపించాడు.