ఐసీసీ వరల్డ్ కప్ 2019 నిజంగా సౌతాఫ్రికాకు ఒక గుర్తుంచుకునే చేదు అనుభవాన్ని మిగిల్చింది. టోర్నీ ఆద్యంతం ఏ జట్టుతోనూ సఫారీలు సరిగ్గా ఆడలేదు. ఫలితంగా వారు ఈ సారి వరల్డ్ కప్ నుంచి ముందుగానే నిష్క్రమించారు.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 నిజంగా సౌతాఫ్రికాకు ఒక గుర్తుంచుకునే చేదు అనుభవాన్ని మిగిల్చింది. టోర్నీ ఆద్యంతం ఏ జట్టుతోనూ సఫారీలు సరిగ్గా ఆడలేదు. ఫలితంగా వారు ఈ సారి వరల్డ్ కప్ నుంచి ముందుగానే నిష్క్రమించారు. ఇవాళ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సఫారీలు ఓడారు. వారిపై పాక్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేయగా ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో హారిస్ సొహెయిల్ (59 బంతుల్లో 89 పరుగులు, 9 ఫోర్లు, 3 సిక్సర్లు), బాబర్ ఆజం (80 బంతుల్లో 69 పరుగులు, 7 ఫోర్లు)లు రాణించారు.
ఇక పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్లు ఏమాత్రం సరిగ్గా ప్రదర్శన చూపించలేకపోయారు. వారిలో ఎంగిడి 3, ఇమ్రాన్ తాహిర్ 2 వికెట్లు తీయగా, పెహ్‌లుక్‌వాయో, మార్క్రంలు చెరొక వికెట్ చొప్పున తీశారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఏ దశలోనూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఎప్పటికప్పుడు పెవిలియన్ బాట పట్టారు. దీంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 259 పరుగులు మాత్రమే చేసింది. చివరికి ఓటమి పాలైంది.
కాగా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ డుప్లెసిస్ (79 బంతుల్లో 63 పరుగులు, 5 ఫోర్లు) ఒక్కడే కొంత సేపు ఆడాడు. ఇక మిగిలిన సఫారీ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. కాగా పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్, షాదాబ్ ఖాన్‌లు చెరో 3 వికెట్లు తీయగా, మహమ్మద్ అమీర్ 2, షాహీన్ అఫ్రిది 1 వికెట్ తీశాడు.