ఐపీఎల్‌ వాయిదా… మరి టీ20 వరల్డ్ కప్ పరిస్థితేంటి..?

-

దేశంలో క‌రోనా తీవ్రరూపం దాల్చినప్పటికీ బీసీసీఐ మాత్రం ఐపీఎల్‌ నిర్వహణపై వెనక్కి తగ్గలేదు. టోర్నీ ప్రారంభానికి ముందే పలువురు ఆటగాళ్ళు కరోనా బారిన పడినప్పటికీ ఈ టోర్నీని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీసీసీఐ మ్యాచ్ లను ప్రారంభించింది. బ‌యో బ‌బుల్‌ నిబంధనలను క‌ఠినంగా అమలు చేస్తూ దాదాపు 24 రోజుల పాటు మ్యాచ్ లను విజయవంతంగా నిర్వహించింది. అయితే ఎన్ని చర్యలు తీసుకున్నా ఆటగాళ్ళను మాత్రం క‌రోనా వీడలేదు. వరుసగా ఆటగాళ్ళు, సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో ఐపీఎల్‌ను తప్పక వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో టోర్నీని మధ్యలోనే వాయిదా వేస్తూ బీసీసీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

ఎన్నో అనుమానాల మధ్య ఐపీఎల్‌ను ఆరంభించిన బీసీసీఐకి ఇపుడు టీ20 వరల్డ్ కప్ నిర్వహణ కూడా పెను సవాల్ గా మారనుంది. భారత్ వేదికగా అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్‌ల‌లో టీ20 వరల్డ్ కప్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే కరోనా ఉగ్రరూపంతో దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపైనా నీలి నీడ‌లు కమ్ముకున్నాయి. బీసీసీఐ ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించి ఉంటే ఈ మెగాటోర్నీని కూడా భారత్ లో విజయవంతంగా నిర్వహించవచ్చనే నమ్మకం బీసీసీఐలో ఉండేది. అయితే ఐపీఎల్‌ వాయిదాతో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఇపుడు అనుమానాలు మొదలవుతున్నాయి.

అయితే ఈ మెగాటోర్నీలో 16 దేశాలు పాల్గొననున్న నేపథ్యంలో ఏ మాత్రం తేడా వచ్చినా బీసీసీఐతో పాటు భార‌త ప్ర‌భుత్వ ప‌రువు కూడా పోయే అవకాశం ఉంది. అయితే దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా టీ20 వరల్డ్ కప్ కు యూఏఈని ప్ర‌త్యామ్నాయ వేదిక‌గా బీసీసీఐ ఎంచుకుంద‌న్న వార్త‌లు ఇటీవలే వ‌చ్చాయి. తాజాగా ఐపీఎల్ వాయిదా ప‌డ‌టంతో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను యూఏఈకి త‌ర‌లించ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే యూఏఈ వేదికగా గతేడాది ఐపీఎల్‌ విజయవంతంగా ముగిసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news