ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నీకి వేళయింది. టోక్యో వేదికగా సోమవారం నుంచి మొదలవుతున్న మెగా టోర్నీలో సత్తా చాటేందుకు భారత షట్లర్లు సర్వశక్తులతో సిద్ధమయ్యారు. బర్నింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో పథకాలు సాధించి మంచి జోరు మీదున్న మన షట్లర్లు ప్రపంచ టోర్నీలో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. అయితే కామన్వెల్త్ లో గాయపడ్డ స్టార్ షట్లర్ పివి సింధు ఈ టోర్నీకి దూరమైంది. గత దశాబ్ద కాలంలో గాయంతో సింధు దూరం కావడం ఇదే తొలిసారి.
2019లో స్వర్ణం సహా 5 పథకాలు సొంతం చేసుకున్న ఈ తెలుగు అమ్మాయి ప్రపంచ టోర్నీ పై తనదైన ముద్రవేసింది. సింధు గైర్హాజరి లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ పై భారీ ఆశలు నెలకొన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ తో పాటు అంతకుముందు జరిగిన థామస్ కప్ టోర్నీలో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించడంలో వీరిద్దరూ కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా యువ షట్లర్ లక్ష్య సేన్ అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతున్నాడు. గత టోర్నీలో శ్రీకాంత్ రజతం గెలువగా, లక్ష్యసేన్ కాంస్యం దక్కించుకున్నాడు. అయితే గతంతో పోలిస్తే ఈసారి ప్రపంచ స్టార్ షట్లర్లు కెంటో మోమొటో, జోనాధన్ క్రిస్టి, ఆంటోనీ జింటింగ్ నుంచి శ్రీకాంత్, లక్ష్యసేన్ కు కఠిన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
వీరిద్దరికీ తోడు ప్రణయ్ సత్తా చాటేందుకు పట్టుదలతో ఉన్నాడు. గత కొన్ని టోర్నీలుగా నిలకడగా రాణిస్తున్న ప్రణయ్ కు ఆదిలోనే మోమొట నుంచి షాక్ తగిలే అవకాశం ఉంది. 2019లో కాంస్యం గెలిచిన సాయి ప్రణీత్ తిరిగి ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతున్నాడు. టోక్యో ఒలంపిక్స్ లోను తీవ్రంగా నిరాశపరిచాడు. మహిళల సింగిల్స్ లో సింధు గైర్హజరిలో సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ తనలో వేడి తగ్గలేదని నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నది. గత కొన్నేళ్లుగా గాయాలతో సతమతమవుతున్న ఈ హైదరాబాద్ షట్లర్ ఏ మేరకు టోర్నీలో ముందంజ వేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి పై భారీ అంచనాలు నెలకొన్నాయి.