యువరాజ్ సింగ్ క్రికెట్ ప్రస్థానం.. యువతకు స్ఫూర్తిదాయకం..!

-

క్యాన్సర్ వచ్చింది అంటేనే చాలామంది భయపడిపోతారు. ఇక తమ జీవితమే అయిపోయిందని అనుకుంటారు. కానీ.. యూవీ మాత్రం ఏమాత్రం ఆందోళన చెందకుండా.. రిలాక్స్ డ్ గా అమెరికా వెళ్లి చికిత్స చేయించుకొని.. మనోస్థైర్యాన్ని పెంచుకొని క్యాన్సర్ మహమ్మారిని జయించాడు.

యువరాజ్ సింగ్.. అనగానే ఆల్ రౌండర్, సిక్సర్ల సింగ్ అనే పేర్లే గుర్తొస్తాయి. భారత క్రికెట్ ప్రస్థానంలో యూవీ రోల్ మరిచిపోలేనేది. ముఖ్యంగా 2011 లో భారత్ ప్రపంచ కప్ ను గెలవడంలో ముఖ్య పాత్ర పోషించారు యూవీ. అందుకే.. యూవీని 2011 ప్రపంచ కప్ హీరో అని కూడా పిలుస్తారు. అయితే ఆయన క్రికెట్ కెరీర్ ఏమీ పూలపాన్పు కాదు. రెడ్ కార్పెట్ కాదు. ఎన్నో ఒడిదొడుకులు.. ఎన్నో పోరాటాలు.. ఎన్నో సమస్యలు.. అన్నింటినీ తట్టుకొని క్రికెట్ కెరీర్ లో సక్సెస్ గా నిలిచాడు యూవీ. అందుకే ఆయన క్రికెట్ జీవితం… ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన విజయగాథను యువత ఆదర్శంగా తీసుకోవచ్చు.

క్యాన్సర్ బాధపెట్టినా 2011 ప్రపంచకప్ లో మెరుగైన ప్రదర్శన

ముందు మనం యూవీ గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి. 2011 ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకున్నదని తెలుసు కదా. అయితే.. 2011 ప్రపంచ కప్ భారత్ కు రావడానికి ధోనీ ఎంత కారణమో.. యూవీ కూడా అంతే కారణం. 2011 ప్రపంచ కప్ ఆడుతున్న సమయానికే ఆయనకు క్యాన్సర్ మహమ్మారి సోకింది. అయినప్పటికీ.. ఏమాత్రం భయపడకుండా, టెన్షన్ పడకుండా 2011 ప్రపంచ కప్ ఆడి… భారత్ కు కప్ అందించి.. అప్పుడు అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నాడు యూవీ.

క్యాన్సర్ మహమ్మారిని జయించి మళ్లీ క్రికెట్ లోకి

క్యాన్సర్ వచ్చింది అంటేనే చాలామంది భయపడిపోతారు. ఇక తమ జీవితమే అయిపోయిందని అనుకుంటారు. కానీ.. యూవీ మాత్రం ఏమాత్రం ఆందోళన చెందకుండా.. రిలాక్స్ డ్ గా అమెరికా వెళ్లి చికిత్స చేయించుకొని.. మనోస్థైర్యాన్ని పెంచుకొని క్యాన్సర్ మహమ్మారిని జయించాడు. క్యాన్సర్ చికిత్స కోసం దాదాపు సంవత్సరంనర పాటు ఆయన తనకు ఇష్టమైన క్రికెట్ కు దూరం కావాల్సి వచ్చింది.

క్యాన్సర్ చికిత్స తర్వాత అంతగా రాణించని యూవీ

యూవీ క్యాన్సర్ నైతే జయించాడు కానీ.. తర్వాత క్రికెట్ కెరీర్ లో అంతగా రాణించలేకపోయాడు. క్రికెట్ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. భారత జట్టు కానీ.. బీసీసీఐ కానీ.. ఆయనకు ఎంతో మద్దతు పలికినప్పటికీ.. యూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దాంతో పాటు జట్టులోకి కొత్త కొత్త ఆటగాళ్లు రావడం, వాళ్ల నుంచి పోటీ రావడంతో యూవీ అనుకున్న స్థాయిలో క్రికెట్ ఆడలేకపోయాడు. ఫామ్ లో కొనసాగలేకపోయాడు.

యూవీ క్రికెట్ ప్రస్థానం

2000 సంవత్సరంలో యూవీ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కెన్యాపై జరిగిన మ్యాచ్ తో తెరంగేట్రం చేసిన యూవీ… 2017లో తన ఇంటర్నేషనల్ కెరీర్ ను ముగించాడు. వెస్టిండీస్ తో ఆడిన మ్యాచ్ తన చివరి వన్డే. 2003లో టెస్టు క్రికెట్ కెరీర్ ను యూవీ ప్రారంభించాడు. 2012లో ఇంగ్లండ్ పై తన చివరి టెస్ట్ ను ఆడాడు. ఇక.. అంతర్జాతీయ టీ20ని 2017లో చివరగా ఇంగ్లండ్ పై ఆడాడు యూవీ. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆడినప్పటికీ.. యూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.

అయితే.. 2000లో అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించడానికి ముందే.. 1996లో యూవీ అండర్ 15 వరల్డ్ కప్ ఆడి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను సొంతం చేసుకున్నాడు. 2000లో అండర్ 19 వరల్డ్ కప్ లో, ఆ తర్వాత 2007 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకున్నాడు.

6 బంతుల్లో 6 సిక్సులు

ఇక.. యూవీ క్రికెట్ కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు, ఎన్నో సంచలనాలు.. ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. ఉదాహరణకు.. 2007 టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో యూవీ… 6 బంతులకు 6 సిక్సులు కొట్టి కొత్త ట్రెండ్ ను సృష్టించాడు.

40 టెస్ట్ మ్యాచులు… 1900 పరుగులు

యూవీ మొత్తం 40 టెస్ట్ మ్యాచులు ఆడాడు. వాటిలో 1900 పరుగులు చేశాడు. టెస్ట్ మ్యాచుల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు కొట్టాడు.

యూవీ తన వన్డే మ్యాచ్ కెరీర్ లో 304 మ్యాచులు ఆడాడు. వాటిలో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలను చేసి ఓవర్ ఆల్ గా 8701 పరుగులు చేశాడు. టీ20ల్లో 58 మ్యాచులు ఆడి 8 హాఫ్ సెంచరీలు చేసి 1177 పరుగులు చేశాడు.

కెప్టెన్సీగా కూడా అవకాశం?

ఒకానొక సమయంలో యువరాజ్ సింగ్ కు కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ భావించినప్పటికీ.. అప్పట్లో ధోనీ వైపే మొగ్గు చూపారు. ఒకవేళ ధోనీ కెప్టెన్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా యూవీ కెప్టెన్ అయి ఉండేవాడు. 2011 ప్రపంచ కప్ తర్వాత యూవీ క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లి ఉండకపోయి ఉంటే.. యూవీకి క్యాన్సర్ రాకపోయి ఉంటే ఖచ్చితంగా యూవీని బీసీసీఐ భారత జట్టుకు కెప్టెన్ ను చేసేది. కానీ.. క్యాన్సర్ మహమ్మారి యూవీ క్రికెట్ కెరీర్ ను నాశనం చేసింది. చికిత్స తర్వాత ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ… మునుపటి ఫామ్ లోకి రాలేకపోయాడు. అయినప్పటికీ.. భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ది ప్రత్యేక పాత్ర. యువరాజ్ సింగ్ లేని భారత క్రికెట్ ను ఊహించుకోలేం. ఆయన క్రికెట్ కెరీర్ యూత్ కు ఇన్సిపిరేషన్. ఆయన్ను చూసి యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అందుకే ఆయన క్రికెట్ ప్రస్థానం.. ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

Read more RELATED
Recommended to you

Latest news