కట్టుదిట్టమైన భద్రత నడుమ శ్రీలంక అధ్యక్ష సచివాలయం సోమవారం పునఃప్రారంభమైంది. 107 రోజుల కిందట ఈ భవనంలో కార్యకలాపాలు ఆగిపోయాయి. జులై 9న ఆందోళనకారులు ఈ భవనంలోకి చొచ్చుకెళ్లి, దాన్ని తమ ఆక్రమణలో ఉంచుకున్నారు.
ఆందోళనలకు వేదికైన ఈ భవనాన్ని కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె ఆదేశాల మేరకు గత శుక్రవారం భద్రతా దళాలు దీన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. దీంతో సోమవారం నుంచి ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. అధ్యక్ష సచివాలయం ఎదుట ఉన్న గాలె రోడ్డుపై ట్రాఫిక్‌ను భద్రతా దళాలు ఇప్పటికే అనుమతించాయి.
ఆందోళనల కారణంగా ఈ భవనం బాగా దెబ్బతింది. దీనికి మరమ్మతులు అవసరం. ఈ ప్రాంగణాన్ని ఆక్రమించడం, దానికి నష్టం కలిగించడం, విలువైన వస్తువులను తస్కరించడంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఈ నెల 13న శ్రీలంక పార్లమెంటరీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించే క్రమంలో ఒక సైనికుడి నుంచి ఆందోళనకారులు లాక్కొన్న రైఫిల్‌ను సోమవారం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.