తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ బోర్డ్ శుభవార్త చెప్పంది. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను రివైజ్ చేసినట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే మార్చిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పది పరీక్షలు రాసే విద్యార్థులు చదివే పాఠశాలల్లో ప్రధానాచార్యులకు ఫీజులు చెల్లించాలని సూచించింది విద్యాశాఖ. అయితే.. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా నవంబరు 15వ తేదీ వరకు పరీక్ష రుసుం రూ.125 మాత్రమే చెల్లించాలని చెప్పారు. రూ.50 ఆలస్య రుసుంతో 30 వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబరు 15, రూ.500 ఆలస్య రుసుంతో 29వ తేదీ వరకు గడువు ఉందన్నారు.
అయితే.. ఈ నేపథ్యంలో నేటితో పరీక్ష ఫీజు గడువు ముగుయనున్న క్రమంలో.. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని ఈ నెల 24 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. అంతేకాకుండా.. అదనంగా వసూలు చేస్తే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇక నుంచి ఆరు పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు జరుగుతున్నాయి. హిందీ మినహా మిగితా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు ఉంటున్నాయి. అయితే, కరోనా వ్యాప్తి సమయంలో 2021 ఏడాది 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ఏడాది కోవిడ్ ఉద్ధృతి కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు.