చిన్న రాకెట్లతో ఉపగ్రహ ప్రయోగాల్లో కొత్త శకం లిఖిద్దామనుకున్న ఇస్రోకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దేశం 75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ చేపట్టిన.. దేశ తొట్ట తొలి చిన్న ఉపగ్రహ వాహకనౌక SSLV-D1 ప్రయోగం విఫలమైంది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అయితే, మిగిలిన మూడు దశలు ఆశించిన విధంగానే జరిగాయని అయన పేర్కొన్నారు సోమనాథ్. ప్రయోగ వాహనం, ఉపగ్రహాల స్థానాన్ని నిర్ధారించడానికి అంతరిక్ష సంస్థ డేటాను విశ్లేషిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు సోమనాథ్. SSLV-D1/EOS-02 భూమి పరిశీలన ఉపగ్రహాంతోపాటు విద్యార్థులు అభివృద్ధి చేసిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.
అయితే, ఈ రాకెట్ ప్రయోగించిన కొద్ది నిమిషాల తర్వాత శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి సోమనాథ్ మాట్లాడుతూ, “అన్ని దశలు ఆశించిన విధంగానే జరిగాయి. మొదటి, రెండవ, మూడవ దశలు తమ పనిని సక్రమంగా పూర్తి చేశాయి. అయితే టెర్మినల్ దశలో కొంత డేటా నష్టం జరిగింది. మేం డేటాను విశ్లేషిస్తున్నాం. లాంచ్ వెహికల్ పనితీరుతో పాటు ఉపగ్రహాల స్థితి గురించి త్వరలో సమాచారం ఇస్తాం. అప్పటివరకు దయచేసి వేచి ఉండండి. పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.