ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ దుబాయ్‌లో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు కొనసాగనున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే టోర్నీ శాటిలైట్, డిజిటల్ ప్రసార హక్కులను ఇప్పటికే స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్‌కు స్టార్ స్పోర్ట్స్ సంస్థ బీసీసీఐకి ఆయా హక్కుల నిమిత్తం రూ.3,270 కోట్లను చెల్లించనుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ బీసీసీఐ స్టార్ స్పోర్ట్స్ సంస్థకు ఆ మొత్తంలో ఎలాంటి రాయితీని ఇవ్వలేదని తెలిసింది. అందువల్ల ఇటు స్టార్ స్పోర్ట్స్ కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా యాడ్స్ ప్రసారానికి గాను ఈసారి కూడా ఏమాత్రం తగ్గింపు లేకుండా భారీ ఎత్తున అడ్వర్టయిజ్‌మెంట్ చార్జిలను వసూలు చేయనున్నట్లు తెలిసింది.
ఐపీఎల్ 13వ సీజన్‌లో ఒక్కో మ్యాచ్‌లో యాడ్స్ ను ప్రసారం చేసేందుకు గాను ఈసారి స్టార్ స్పోర్ట్స్ భారీగానే అడ్వర్టయిజ్‌మెంట్ చార్జిలను వసూలు చేయనుంది. మ్యాచ్‌ల సందర్భంగా 10 సెకన్ల యాడ్‌కు గాను రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు స్టార్ స్పోర్ట్స్ వసూలు చేయనుంది తెలిసింది. దీని వల్ల స్టార్ స్పోర్ట్స్ ఈసారి భారీ ఎత్తున ఆదాయం పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
గతేడాది ఐపీఎల్ మ్యాచ్‌లలో యాడ్స్‌కు గాను స్టార్ స్పోర్ట్స్ సంస్థ రూ.3వేల కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించింది. అయితే ఈ సారి అంతకన్నా ఎక్కువగానే ఆదాయం పొందాలని ఆ సంస్థ చూస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్ మ్యాచ్‌లకు 424 మిలియన్ల వ్యూయర్‌షిప్ వచ్చింది. టీవీ ప్రేక్షకుల్లో 51 శాతం మంది ఐపీఎల్ మ్యాచ్‌లను చూశారు. ఓటీటీలో 300 మిలియన్ల మంది ఐపీఎల్ మ్యాచ్‌లను చూశారు. ఈసారి వ్యూయర్‌షిప్ మరింత పెరుగుతుందని సమాచారం. గతేడాది ఇండియాలోనే టోర్నీ జరిగింది. కానీ ఈ సారి దుబాయ్‌లో టోర్నీ జరుగుతున్నా దానికి ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం లేకపోవడంతో.. ఈసారి టీవీ, ఓటీటీ వ్యూయర్‌షిప్ పెరుగుతుందని స్టార్ భావిస్తోంది. అందుకనే భారీ మొత్తంలో యాడ్స్ కు చార్జిలను వసూలు చేయాలని కూడా ఆ సంస్థ చూస్తోంది.
అయితే త్వరలో బిగ్ బాస్, ఇండియన్ ఐడల్, కౌన్ బనేగా కరోడ్‌పతి వంటి షోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆ షోలు పోటీ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ వారంలో ఆ షోలు ఒకటి రెండు రోజులకే పరిమితం అవుతాయి. కానీ ఐపీఎల్ మ్యాచ్‌లు రోజూ ఉంటాయి.. కనుక అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మరి స్టార్ స్పోర్స్ ఈ సారి ఐపీఎల్ వ్యూయర్‌షిప్‌ను ఏ మేర సాధిస్తుందో చూడాలి.