రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయి అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జూన్, జూలైలో కొత్త ప్రభుత్వం వస్తుందని.. అది కూడా కాంగ్రెస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలోని పరిగిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్, డిజిటల్ కార్డుల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ప్రతి గడప తట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని.. పార్టీలో చేర్పించాలని కోరారు.
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, వారికి అండగా ఉంటామని అన్నారు. అటు మోడీ పైన విమర్శలు చేశారు రేవంత్. బిజెపి ఎన్ని కుట్రలు చేసిన గాంధీ కుటుంబం వెంట్రుక కూడా పీకలేరు అని అన్నారు. సోనియా గాంధీని అవమానించాలని మోడీ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే పాత కేసులు తోడి ఈడీ నోటీసులు ఇప్పిస్తున్నారు అని ఆరోపించారు. ఈనెల 13న ఇందిరా గాంధీ విగ్రహం నుండి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈడి ఆఫీస్ కి లక్షలాది గా తరలిరావాలని పిలుపునిచ్చారు.