ప‌ద‌వులు పందేరం.. అధినేత క‌రుణించ‌డు.. ప‌దవులు ఇవ్వ‌డు..

-

చిటారి కొమ్మ‌న మిఠాయి పొట్లం.. అందుకో అందుకో అన్న‌ట్లుంది ఈ నేత‌ల ప‌రిస్థితి. అధినేత క‌రుణించ‌డు.. ప‌దవులు ఇవ్వ‌డు.. ఇదిగో ఇప్పుడు ఇస్తున్నా.. అదిగో అప్పుడిస్తా అంటూ ఊరించి ఊరించి ఊసురుమ‌నిపిస్తున్నాడు.. కానీ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసేది లేదు.. నేత‌ల‌ను సంతృప్తి ప‌రిచేది లేదు.. ఇలా కాలం గడుస్తూనే ఉంది.. గ‌డువులు తీరుతూనే ఉన్నాయి.. అధినేత అనుకున్న లక్ష్యాలు నెర‌వేరుతూనే ఉన్నాయి.. కానీ ఆశాజీవుల ఆశ‌లు మాత్రం తీర‌డం లేదు.. అధినేత గ‌డువులు పెట్ట‌డం.. నేత‌లు ఆశ‌లు పెంచుకోవ‌డం.. గ‌డువు దాటిపోవ‌డం.. నేతల ఆశ‌లు తీర‌క‌పోవ‌డం… ప‌దినెల‌లుగా ఇలా ప‌ద‌వులు పందేరం సాగుతూనే ఉంది.. కానీ ఒక్క ముంద‌డుగు ప‌డ‌టం లేదు.

కానీ ఆశా జీవులు మాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు.. ఏదేమైనా బ‌స్తీమే స‌వాల్ అంటూ మ‌రో యుద్ధానికి సిద్ద‌మ‌వుతున్నారు… ఆ బాస్‌కు కావాల్సిందే అదే క‌దా.. అందుకే ప‌ద‌వి కావాలా నాయ‌నా… బ‌స్తీమే స‌వాల్ అని రంగంలోకి దూకూ.. నీ బ‌స్తీని మ‌న ఖాతాలోకి చేర్చు.. అప్పుడే ప‌ద‌వి అంటున్నాడు ఈ బాస్.. ఈ బ‌స్తీ స‌వాల్ అయ్యేదెన్న‌డో… ఆశాజీవుల కోరిక తీరేదెన్న‌డో అని కొంద‌రు ఎదురు చూస్తుంటే.. కొంద‌రు బుద్ది జీవులు మాత్రం త‌మ దారి తాము చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు..

ఇంత‌కు అస‌లు విషయం చెప్ప‌లేదు క‌దూ.. తెలంగాణలో గులాబీ తోట‌లో ప‌నిచేస్తున్న వారికి ప‌ద‌వుల పందేరం ముందుంద‌ని గులాబీ బాస్ గ‌త కొంత కాలంగా ప్ర‌క‌టిస్తూనే ఉన్నాడు.. కాదు కాదు ఊరిస్తూనే ఉన్నాడు.. తెలంగాణ‌లో ప‌ద‌వులు జాత‌ర‌కు తెర‌లేచింద‌ని, త్వ‌ర‌లోనే ప‌నిచేసిన వారికి వారి ప్రాధాన్య‌త ప్ర‌కారం నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తాన‌ని గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌కటించారు.. తెలంగాణ‌లో స‌ర్కారు కొలువు దీరి 10 నెల‌లు అవుతుంది. ఇప్పటి వ‌ర‌కు కొన్ని కార్పొరేష‌న్ ప‌దవులు, కొన్ని ఎమ్మెల్సీ, కొన్ని ఇత‌రాత్ర ప‌ద‌వుల‌ను భర్తీ చేస్తారు కేసీఆర్‌. అయితే ఇంకా అనేక నామినేటేడ్ ప‌ద‌వులు నియామాకాలు కాక మిగిలి ఉన్నాయి.

అయితే వీటిని భ‌ర్తీ చేసుడు ఖాయం.. అంటూ గ‌త 10నెల‌ల నుంచి కేసీఆర్ ఊరిస్తూనే ఉన్నాడు. గ‌డువులు విధించాడు. కానీ గ‌డువులు ముగుస్తూనే ఉన్నాయి.. కొత్త గ‌డువులు వ‌స్తూనే ఉన్నాయి.. పోతూనే ఉన్నాయి.. కానీ ప‌ద‌వుల మీద ఆశ చావ‌నోల్లు మాత్రం ఎప్పుడు ప‌ద‌వుల పందేరం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.. ఇటీవ‌ల తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ సంద‌ర్భంగా అనేక అల‌క‌లు, తిరుగుబాట్లు గులాబీ తోట‌లో వినిపించాయి. కానీ వాటిని గులాబీ బాస్ చ‌ప్పున చ‌ల్లార్చారు.. అయితే కేబినెట్ విస్త‌ర‌ణ పూర్తికాగానే ప‌ద‌వులు పందెరం.. అందులో నీకే ముందు పెద్ద పీట వేస్తాన‌ని ఎంద‌రినో బుజ్జ‌గించారు గులాబీ బాస్‌.. అందులో 12 మంది ఎమ్మెల్యేల‌కు కార్పోరేష‌న్ ప‌ద‌వులు ఇస్తాన‌ని మాటిచ్చారు. అంతే కాదు కొంద‌రికి రాజ్య‌స‌భ‌, ఎమ్మెల్సీ ప‌దవులు ఇస్తాన‌ని అభ‌యం ఇచ్చారు.

కానీ కేబినెట్ విస్త‌ర‌ణ అయిపోయింది.. ప‌దవులు వ‌స్తాయ‌ని ఎదురు చూసేవారు చూస్తూనే ఉన్నారు.. కానీ ప‌ద‌వులు భ‌ర్తీ జ‌రుగ‌లేదు.. ఇప్పుడు ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌మంటే.. ఆగాగు ముందుంది మున్సిఫోల్స్ అయిపోగానే ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తామ‌ని బాస్ గ‌డువు పెట్టార‌ట మ‌రోసారి.. అయితే ఇందులో ఓ తిర‌కాసు కూడా పెట్టార‌ట‌.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎవ‌రైతే పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకొని వ‌స్తారో వారికే ఈ ప‌దవులు అని ష‌ర‌తులు పెడుతున్నార‌ట‌.. ఇప్ప‌టికే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జెండా పాతాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు అదునుకోసం ఎదురు చూస్తున్నార‌ట‌. అందుకే ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం లేకుండా అధికార పార్టీ గెలిస్తేనే ప‌ద‌వులు అంటూ కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నార‌ట‌.. ప‌ద‌వులు పందేరం ఇప్పుడు లేదు.. మున్సిప‌ల్ ఎన్నిక‌లు ముగిసిన త‌రువాతే అని తేలిపోయింది.. సో బ్ర‌ద‌ర్ బీ కేర్‌ఫుల్‌.. లేకుంటే మీకు ప‌ద‌వి నిల్‌.. అందుకే ప‌ద‌వి కావాలంటే కొన్ని ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి… మున్సిఫోల్ లో సీటు కొట్టు.. ప‌ద‌వి ప‌ట్టు.. ఇదే ఆశావాహుల‌కు కేసీఆర్ ఇచ్చే బంప‌రాఫ‌ర్‌..

Read more RELATED
Recommended to you

Latest news