కేసీఆర్ నిర్ణయం వెనక బలమైన రాజకీయ వ్యూహం ఉందా?

-

తెలంగాణలో సరికొత్త రాజకీయ వ్యూహానికి తెరలేచిందా.. నియంత్రిత సాగు, పంటల కొనుగోళ్ల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయం నుంచి సీఎం కేసీఆర్‌ వెనక్కి తగ్గిన తర్వాత రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న ఇదే. గులాబీ బాస్‌ ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనక బలమైన రాజకీయ వ్యూహాలు ఉంటాయన్నది అధికార పార్టీలో వినిపించే మాట. ఈ నిర్ణయంతో బీజేపీని ఇరకాటంలో పెట్టబోతున్నారా తాజా పరిణామాలను ఆ కోణంలోనే చూడాలని అభిప్రాయ పడుతున్నారట నాయకులు. ఈ నిర్ణయం వెనక రాజకీయ కారణాల పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

నియంత్రిత సాగు, పంటల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ ఎందుకు తన స్టాండ్‌ మార్చుకున్నారు.. రైతుల పోరాటానికి మద్దతుగా రోడ్డెక్కిన అధికార పార్టీ.. ఇప్పుడు ఆ చట్టాలలో అలాగే ఉందని ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. నియంత్రిత సాగువల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆ నిర్ణయం ప్రకటించే సమయంలో చెప్పారు ముఖ్యమంత్రి. చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు సాయం రాదని.. పంటలను కొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు రైతులు ఎవరిష్టం వచ్చిన పంటలు వారు సాగు చేసుకోవచ్చునని చెబుతున్నారు. నియంత్రిత సాగు విధానం లేదని తేల్చేశారు. అలాగే ప్రభుత్వం కొనబోమని చెబుతోంది ప్రభుత్వం. ఈ నిర్ణయానికి ముందు జరిగిన పరిణామాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాయి పార్టీలు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 కొత్త వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. కొత్త చట్టాల వల్ల రైతులు నష్టపోతారని.. కేంద్రం కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ము కాస్తోందని సీఎంతో సహా మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు నిర్వహించిన భారత్‌ బంద్ లోనూ మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. ఏమైందో ఏమో ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ వైఖరిలో అనూహ్య మార్పు వచ్చింది. నిన్న మొన్నటి వరకు మాట్లాడిన దానికి భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ కేంద్ర చట్టాలనైతే వ్యతిరేకించారో.. ఇప్పుడు ఆ చట్టాల్లో అలాగే ఉందిగా అని ముక్తాయిస్తున్నారు.

రాష్ట్రంలో నియంత్రిత సాగు ఉండబోదని చెబుతూనే.. రైతులు తమకు ఇష్టమొచ్చిన చోట పంటలు అమ్ముకోవచ్చుననే కొత్త చట్టాల్లో ఉందిగా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు దీనిపైనే రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. సీఎం ఎందుకు మనసు మార్చుకున్నారు అని ఎవరికి వారుగా విశ్లేషణలు చెబుతున్నారు. అధికార పార్టీలోనూ దీనిపై చర్చ జరుగుతోందట. కొందరైతే సీఎం కేసీఆర్‌ వ్యూహం అర్థం కాక.. పరిచయస్తుల దగ్గర ఆరా తీస్తున్నట్టు సమాచారం. విపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని నేరుగానే టార్గెట్‌ చేస్తున్నాయి. సీఎం మంచి నిర్ణయమే తీసుకున్నారని ప్రశంసిస్తూనే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది బీజేపీ. ఇదే టైమ్‌ అని భావించిన మిగతా పక్షాలు విమర్శలకు పదును పెడుతున్నాయి.

అయితే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ఏదో జరిగిందని అనుమానిస్తున్నారట కొందరు. కాదు.. కాదు.. బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే దానికి బీజేపీ కారణంగా జనం భావిస్తారని.. రాజకీయంగా అది టీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. రైతుల కోసం ఎంత చేసినా తనపై విమర్శలు ఆగకపోవడంపై సీఎం కేసీఆర్‌ కొన్నాళ్లుగా ఈ అంశంపై తీవ్రంగానే ఆలోచిస్తున్నారట. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను అస్త్రంగా ప్రయోగిస్తున్నారని అనుకుంటున్నారు.

మరి.. అదే వ్యూహమైతే రాజకీయంగా టీఆర్‌ఎస్‌ ఏ మేరకు లబ్ధి పొందుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news