లెక్చరర్ దాష్టీకం.. విద్యార్థినిని 5 రోజులు నిల్చోబెట్టిన వైనం.. చివరకు కాళ్లు చచ్చుబడిపోయి..

-

విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని కొన్నిసార్లు గురువులు చేసే పనులు విద్యార్థుల ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. అలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చోటుచేసుకుంది. లెక్చరర్ చేసిన ఓ పనికి విద్యార్థిని కాళ్లు చచ్చుబడిపోయాయి. అసలేం జరిగిందంటే..?

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలానికి చెందిన ఓ విద్యార్థిని బీకాం కంప్యూటర్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 18న అనారోగ్యంగా ఉందని ఒక రోజు సెలవు పెట్టి వెళ్లిన విద్యార్థిని 23న కళాశాలకు వచ్చింది. ఆలస్యంగా వచ్చిన ఆ విద్యార్థినిని అధ్యాపకురాలు డి.మహేశ్వరి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరసగా అయిదు రోజులపాటు నిలబెట్టింది. దీంతో ఆమె కాళ్లలో స్పర్శ కోల్పోయి నడవలేని పరిస్థితి ఏర్పడింది.

ఆదివారం తోటి విద్యార్థుల సాయంతో వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు వివిధ పరీక్షలు చేసి అనంతరం ఎమ్మారై స్కానింగ్‌ కోసం సిరిసిల్లలోని జిల్లా ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి స్పందించారు. అధ్యాపకురాలు మహేశ్వరిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్న మాతంగి కల్యాణిపై తగిన చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రిన్సిపల్‌ కల్యాణి శనివారం బదిలీపై వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news