చాలా మందికి వాళ్లు బతికే ఉన్న కొన్నిసార్లు కొన్ని రికార్డుల్లో చనిపోయామని వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటిది ఓటరు కార్డుల్లో జరుగుతుంటాయి. కానీ ఏపీలో మాత్రం ఓ విద్యార్థికి ఇలాంటి అనుభవం ఎదురైంది. అమ్మఒడి పథకం అమలు కావడం లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం విని ఆ విద్యార్థి, అతడి తల్లి షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని బోస్‌నగర్‌లో నివాసముంటున్న ఫాతిమా కుమారుడు బాబాజీ. తన కుమారుడికి అమ్మఒడి పథకం వర్తింపజేయలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఫాతిమా ప్రశ్నించగా.. ‘మీ అబ్బాయి బతికే ఉన్నా ఈకేవైసీలో మాత్రం చనిపోయాడు’’ అని చెప్పారన్నారు. వార్డు వాలంటీర్లు మ్యాపింగ్ సమయంలో చేసిన తప్పిదం శాపంగా మారిందని, ఏడాదిన్నర నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆమె వాపోయారు.
జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని కలిసేందుకు కుమారుడిని వెంటబెట్టుకుని ఇడుపులపాయకు వచ్చారామె. పోలీసులు అనుమతించకపోవటంతో సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించి.. చివరకు స్పందనలో అర్జీ సమర్పించి వెనుదిరిగారు. వితంతు పింఛను, అమ్మఒడి మంజూరు చేయాలని ఆమె వేడుకుంటున్నారు.