ఆఫీసుల్లో, సరదాగా బయటకు వెళ్లినప్పుడు చాలామందికి టీ తాగటం అలవాటుగా ఉంటుంది. జ్యూస్ షాప్స్ కూడా రస్నాలాంటివి పేపర్ కప్స్ లోనే ఇస్తుంటారు. ఇక ఆఫీసుల్లో మనం ప్రతిసారి ఛాయ్ తాగలంటే..అక్కడ ఉండే పేపర్ కప్స్ లోనే తాగుతాం. ఇలా మన దయనందిన జీవితంలో ఇది ఒక భాగం అయిపోయింది. కానీ ఇలా పేపర్ కప్స్ లో టీ తాగటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు అంటున్నారు.
ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన తర్వాత దేశమంతటా..ఈ పేపర్ కప్పుల వినియోగం భారీగా పెరిగింది. మనం కూడా ప్లాస్టిక్ కాదుకదా అని..ఎలాంటి సందేహం లేకుండా హ్యాపీగా తాగేస్తున్నాం. టీ స్టాల్స్, జ్యూస్ సెంటర్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లలో అంతటా ఇవే కనిపిస్తున్నాయి. ఇవి పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. ఐతే మన శరీరానికి మాత్రం ఎంతో హాని చేస్తాయట.
పేపర్ కప్పుల్లో టీ, ఇతర వేడి ద్రావణాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఖరగ్‌పూర్ ఐఐటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. డిస్పోజబుల్ పేపర్ కప్పులో మూడుసార్లు 100 మి.లీ. చొప్పున వేడి వేడి టీ తాగడం వల్ల 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్తాయని పరిశోధకులు తెలిపారు.
80-90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి కలిగిన 100 మి.లీ. ద్రవ పదార్థం ద్వారా 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కణాలు మనలోకి చేరతాయి. క్రోమియం, కాడ్మియం వంటి హానికారక లోహాలు శరీరంలోకి వెళ్తాయని పేర్కొన్నారు. రైళ్లలో వెళ్లే వారికి పేపర్ కప్పుల్లోనే టీ ఇస్తుంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఆ కప్పుల్లో టీ తాగకపోవడమే మంచిది. లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. అంతేకాదు మృదువైన, తేలికైన ప్లాస్టిక్ ..లో డెన్సిటీ పాలిథిలిన్ ఉండటం వల్ల సాధారణ పరిస్థితుల్లో పేపర్ కప్పుల రీసైక్లింగ్ కష్టతరమవుతోంది.
అందుకే పేపర్ కప్పులకు బదులు స్టీల్ లేదా పింగాణీ లేదా గాజు గ్లాసుల్లో టీ తాగడం మంచిదని సూచిస్తున్నారు. ప్లాస్టిక్, పేపర్ కప్పులకు దూరంగా ఉండటం ఉత్తమం. బయట ఎలాగో తప్పనిసరి పరిస్థితుల్లో తాగుతాం. ఆఫీస్ లో అయితే..పర్మినెంట్ గా ఒక కప్పును అక్కడే ఉంచుకోండి. హ్యాపీగా అందులో తాగవచ్చు. ఇప్పటికే చాలామంది ఆఫీస్ లో ఒక కప్పు మెయిన్ టేన్ చేస్తుంటారు. అది చాలా ఉత్తమమైన మార్గం.