కొన్ని కొన్ని ఘటనలు మనల్ని నిర్ఘాంత పోయేలా చేస్తాయి. అలాంటి ఘటనే ఇది.. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో మధుస్మిత సింగ్ అనే 30 ఏళ్ల మహిళ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. వివిధ కారణాలతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే.. శ్మశానంలో ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. అయితే, అంత్యక్రియలకు హాజరైన ఆమె బంధువులు సుందర్ మోహన్ సింగ్, నరేంద్ర సింగ్ చితిపై కాలిన మధుస్మిత మృతదేహంలోని కొన్ని భాగాలను తిన్నారు.
వారిద్దరూ చితి వద్ద మధుస్మిత శరీర భాగాలను తింటుండడం గమనించి ఇతర బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలు ఉండడంతో వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని మయూర్ భంజ్ జిల్లా ఎస్పీ బి.గంగాధర్ తెలిపారు. సుందర్ మోహన్ సింగ్, నరేంద్ర సింగ్ లను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వారిద్దరూ గతంలో కూడా ఇలాగే నరమాంస భక్షణ చేసేవారా? అనే కోణంలో విచారిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. వారిద్దరూ సారా తాగిన మైకంలో నరమాంస భక్షణ చేశారని పోలీసులు వెల్లడించారు.