నా భూమి.. నా దేశం కార్యక్రమం చేపట్టాలన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నా భూమి.. నా దేశం పేరుతో బీజేపీ మరో కొత్త రాజకీయానికి తెరలేపిందని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా మట్టిని సేకరిస్తామని బీజేపీ చెబుతోందని, బీజేపీ నేతలకు సిగ్గుందా..? ఏపీకి మట్టి – నీరు తెచ్చి ప్రధాని మోడీ అమరావతిని సర్వ నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల నోట్లో ప్రధాని మట్టి కొట్టారని ఆమె ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మట్టి తెచ్చి.. దేశ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి ప్రధాని కంకణం కట్టుకున్నారా..? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తెలుగు వారికి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు.
ఇలాంటి నమ్మక ద్రోహం పనులు.. కార్యక్రమాలు చేయడానికి ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరికి బాధ వేయడం లేదా..? పురంధేశ్వరికి చిత్త శుద్ధి ఉంటే భూములు త్యాగం చేసి రోడ్డున పడ్డ రైతులను ఆదుకోవాలి. జగన్ అమరావతిని సర్వ నాశనం చేస్తే.. బీజేపీ అధినాయకత్వం పల్లెత్తు మాట మాట్లాడ్డం లేదు. అమరావతి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. ప్రధాని మోడీ ఏపీ ప్రజలనే కాదు.. దేశ ప్రజలను మోసం చేయడానికి నా భూమి.. నా దేశం కార్యక్రమం చేపడుతున్నారు. ఇలాంటి చెత్త కార్యక్రమాలకు పురంధేశ్వరి సహకరించడం ఎంత వరకు సబబు..? ప్రజల మనోభావాలతో బీజేపీ ఆడుకుంటోంది. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వాలి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపేయాలి. అమరావతి రాజధాని నిర్మాణం జరిగేలా కార్యచరణ రూపొందించాలి. సీఎం జగనుతో బీజేపీ చీకటి ఒప్పందాలను పక్కన పెట్టాలి.’ అని సుంకర పద్మశ్రీ అన్నారు.