24 వారాల గర్భంతో ఉన్న పెళ్లికాని ఓ మహిళలకు అబార్షన్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దీనిపై గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టిపారేసింది. అవివాహిత మహిళ అబార్షన్ హక్కుపై ఢిల్లీ హైకోర్టు అనవసరమైన ఆంక్షలు విధించిందని పేర్కొంది. పెళ్లి కానప్పటికీ.. ఆమోదంతో కూడిన శారీరక సంబంధం కారణంగా గర్భం దాల్చిన మహిళ తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది.
జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం.. గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకోవడానికి సంబంధించి హక్కులను కల్పించింది. వైద్యుల సమక్షంలో గర్భవిచ్ఛిత్తికి అనుమతించింది. పెళ్లి కానీ వారు, భర్త చనిపోయిన వారు పిల్లలను వద్దనుకుంటే.. వారు అబార్షన్ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. కాగా, పెళ్లి కాకుండానే ఓ యువతి గర్భం దాల్చింది. దీంతో బిడ్డను జన్మనివ్వలేనని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మానసిక ఆందోళనకు గురవుతున్నానని, గర్భం తొలగించుకోవడానికి పిటిషన్ దాఖలు చేసుకుంది.