క్షమాభిక్ష పిటిషన్లపై సత్వర నిర్ణయం తీసుకోండి.. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం సూచన

-

క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయంలో విపరీతంగా జాప్యం చేయండపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ జాప్యాన్ని ఉరిశిక్ష పడిన దోషులు అనుకూలంగా మలుచుకుంటున్నారని, వాటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని రాష్ట్రాలు, సంబంధిత అధికారులను ఆదేశించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం తుదితీర్పు ఇచ్చాక కూడా… క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయంలో ఆలస్యం కారణంగా ఉరిశిక్ష ఉద్దేశం నెరవేరడం లేదని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఓ మహిళ, ఆమె సోదరికి విధించిన మరణశిక్షను తగ్గిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2001లో కొల్హాపుర్‌లో 13 మంది చిన్నారులను అపహరించి, తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో స్థానిక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. దానిని 2004లో హైకోర్టు, 2006లో సుప్రీంకోర్టు సమర్థించాయి. ఆ తర్వాత వారి క్షమాభిక్ష పిటిషన్లను 2013లో గవర్నర్‌, 2014లో రాష్ట్రపతి తిరస్కరించారు.

దోషుల క్షమాభిక్ష దరఖాస్తుపై రాష్ట్ర ప్రభుత్వం/గవర్నర్‌ ఏడేళ్ల పది నెలలుగా నిర్ణయం తీసుకోని కారణంగా బాంబే హైకోర్టు వారి ఉరిశిక్షను తిరిగి యావజ్జీవ శిక్షగా మార్చింది. దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చేటప్పుడు నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకోవచ్చంది. ఈ క్రమంలో క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయాలను సాధ్యమైనంత వేగంగా తీసుకోవాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news