పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం -2025 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆయా పిటిషన్ల లిస్టింగ్‌కు అనుమతి ఇస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది.
జమియత్ ఉలమాయె హింద్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఇతర ముస్లిం పక్షాల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, న్యాయవాది నిజాం పాషా వక్ఫ్ చట్టం సవరణ బిల్లు అంశంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన అనంతరం.. కేసులను అత్యవసర విచారణకు చేపట్టాలని మౌఖికంగా ధర్మాసనాన్ని కోరితే చెల్లదని.. సమగ్ర వివరాలతో లేఖ లేదా మెయిల్స్‌ను న్యాయవాదులు పంపాల్సి ఉంటుందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. దీనికి న్యాయవాది కపిల్ సిబల్ బదులిస్తూ తాము ఆ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పడంతో తాను ఆ లేఖలను చూసి లిస్ట్ చేయిస్తామని వెల్లడించారు.