టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కేసులో సుప్రీంకోర్టులో నిందితుల పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణ ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. నిందితుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఈరోజు స్థానిక కోర్టులో బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెలువడనున్నట్లు న్యాయస్థానానికి వివరించారు. అందువల్ల విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేసింది.
మరోవైపు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వరుస సోదాలు నిర్వహిస్తోంది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌కి చెందిన ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపారసంస్థలు, ఆశ్రమాల్లో రెండురోజులుగా తనిఖీలు కొనసాగాయి. శనివారం మొదలైన సోదాలు ఆదివారం రాత్రి వరకు జరిగాయి. తనిఖీల కోసం ఇందుకోసం 7 బృందాలను ఏర్పాటు చేశారు. తెలుగురాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, హరియాణలోనూ తనిఖీలు నిర్వహించాయి. కేరళలో ఓ వైద్యుడి ప్రమేయాన్ని గుర్తించిన పోలీసులు.. కేసుతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు.