లోక్ సభ లో ధరల పెరుగుదలను నిరసిస్తూ, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. అనుచిత ప్రవర్తనతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నందుకుగాను వారిపై వేటు వేసినట్టు స్పీకర్ తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఆ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. వీరిలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ తో పాటు, ఆ పార్టీ ఎంపీలు రమ్య హరిదాస్, జ్యోతి మణి, టిఎన్ ప్రతాపన్ లు ఉన్నారు.
తమను సస్పెండ్ చేయించిన అధికారపక్షం ఎన్డీఏ తీరును నిరసిస్తూ నలుగురు ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు.అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభలో ఫ్లకార్డులు ప్రదర్శించడం, ఆందోళనలకు దిగడం వంటి అంశాలను సహించేది లేదని స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు.