కారణం లేకుండా కాళ్లలో వాపు వస్తుందా..? గుండె నుంచి కిడ్నీ వరకూ అన్నీ ప్రమాదంలోనే

జర్నీ చేసినా, ఎక్కువ సేపు కాళ్లు వేలాడేసి కుర్చున్నా, ఎక్కువ దూరం నడిచినా పాదాలలో వాపు కనిపిస్తుంది. కానీ ఏ కారణం లేకుండా పాదాల్లో వాపు ఉంటే.. అది ఆలోచించాల్సిన విషయం. సంథింగ్ ఈజ్‌ ఫిషీ అనే అర్థం. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతంగా చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇలా పాదాలు, కాళ్లలో వాపు కనిపించడాన్ని ఎడెమా అని పిలుస్తారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు మాత్రం ప్రాణాంతకమైనవి. అందుకే పాదాల వాపును తేలిగ్గా తీసుకోకూడదు. పాదాలు వాస్తే.. వాటికి ఈ కింద సమస్యలు కారణమై ఉండొచ్చు. అవేంటంటే..

కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కాళ్లు, పాదాలలో వాపు కనిపిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉంటే ముఖం కూడా ఉబ్బుతుంది. ఇది ఇలానే వదిలేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. కాబట్టి వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.

లివర్ సమస్యలు ఉన్నవారిలో కూడా పాదాల్లో కాళ్లలో, వాపు ఉంటుంది. కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల పాదాలలో నీరు చేరి ఉబ్బినట్టు అవుతాయి. కాబట్టి పాదాల వాపుకు లివర్ ఫెయిల్యూర్ కూడా ఒక కారణం అని భావించవచ్చు.

కాళ్లలో ఉండే సిరలు రక్తప్రవాహం సరిగా కాకపోయినా నీరు నిలిచిపోయి పాదాల వాపు వస్తుంది. ఇది ఎక్కువగా కూర్చుని పని చేసేవారు, నుల్చని పనిచేసే వారిలో కనిపిస్తుంది.

ఊబకాయం ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వాపును పట్టించుకోకుండా వదిలేస్తే అది ప్రాణాంతకంగా మారుతుంది. చివరికి గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి కాలు, పాదాలలో తరచూ వాపు ఉంటే వైద్యులను సంప్రదించండి.

గుండె సరిగా రక్తాన్ని పంపు చేయనప్పుడు కూడా ఇలాంటి పాదాల వాపు, కాళ్ళ వాపు కనిపిస్తుంది. ఒక్కోసారి రక్తపోటు పెరుగుతుంది. గుండె జబ్బులు ఉన్నవారిలో ఇలా రెండు కాళ్లల్లో వాపు కనిపించడం సహజం. వాపు ఉన్నా, నొప్పి ఉండదు. కానీ నడుస్తున్నప్పుడు ఆయాసం వంటివి వస్తాయి. ఇలా జరిగితే వెంటనే గుండె వైద్య నిపుణులను కలిసి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

పాదాల వాపుతో బాధపడేవారు ఆహారంలో సోడియం తీసుకోవడం తగ్గించాలి. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల వాపు సమస్య మరింత పెరుగుతుంది.