దుబ్బాక,గ్రేటర్ ఎన్నికల దూకుడుతో మంచి ఊపు మీదున్న బీజేపీ నాగర్జున సాగర్ ఉప ఎన్నిక పై ఫోకస్ పెట్టింది. స్థానిక నాయకులు ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తున్నారట. తమదే టిక్కెట్ అంటూ ప్రచారాలు,పాదయాత్రలతో హడావిడి చేస్తున్నారట… దీంతో లాభం లేదని భావించిన బీజేపీ రాష్ట్ర నాయకులు లోకల్ లీడర్స్‌ను హైదరాబాద్‌కు పిలిచి గట్టీ క్లాస్ పీకారట. ఇప్పుడు దీనిపై బీజేపీ నేతల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ నాగార్జునసాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాయి. కాంగ్రెస్ మినహా.. టీఆర్‌ఎస్, బీజేపీలు అభ్యర్థుల వేటలో ఉన్నాయి. బీజేపీలో అయితే జాబితాలో పొందుపరుస్తున్న పేర్లకు అంతే ఉండటం లేదని సమాచారం. కాకపోతే ఆశావహుల సంఖ్య పెరిగిన కొద్దీ స్థానిక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయట. గ్రూప్ వార్ తో పార్టీని డ్యామేజ్ చేస్తునారట. తమకే టిక్కెట్ అంటూ స్థానిక నేతలు చేస్తున్న హడావిడి పై ఎన్నికల నోటిఫికేషన్ వేళ ముందుగా ఫోకస్ పెట్టింది కమలం పార్టీ.
బీజేపీ అనుమతి లేకుండా పాదయాత్రలు..ప్రచారాల చేయడంపై రాష్ట్ర నాయకత్వం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. దీనిపై హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఫిర్యాదులు వెళ్లాయట. ఆ ఫిర్యాదులు ఆధారంగా పాదయాత్ర చేస్తున్న నేతను వివరణ అడిగారట పార్టీ పెద్దలు. అయితే పార్టీకి చెప్పే పాదయాత్ర చేశానని పిలిచినా ఎవరూ రాలేదని చెప్పారట. ఈ వ్యవహారం స్థానికంగా పార్టీలో రగడకు దారితీస్తున్నట్టు తెలుస్తోంది. ఇంఛార్జ్‌లు.. ఇతర నేతలపై వైరి వర్గాలు రుసరుసలాడుతున్నట్టు చెబుతున్నారు.
ఉపఎన్నికకు సిద్ధమవుతున్న సమయంలో నాగార్జునసాగర్ బీజేపీలోని వ్యవహారాలు తలనొప్పిగా మారడంతో.. అక్కడి నాయకులను హైదరాబాద్ పిలిచి క్లాస్ తీసుకున్నారట బండి సంజయ్. సాగర్ లో బీజేపీ రాష్ట్ర వ్వవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ పర్యటన కూడా ఈ గ్రూప్ వార్ కారణంగానే వాయుదా పడినట్లు తెలుస్తుంది. అందుకే ముందుగా స్థానికి గ్రూపులను సరిచేసే పనిలో పడ్డారట బీజేపీ రాష్ట్ర నాయకులు.సొంత అజెండాలు మాని.. కలిసి పనిచేయాలని సూచించారట. అధిష్ఠానం అభ్యర్ధిని ప్రకటించేవరకు ఈ నేతలు సైలెంట్ గా ఉంటారా మరో రచ్చ చేస్తారో చూడాలి.