సిపి స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోండి.. సీఎం కేసీఆర్ కు ఎంపీ రఘురామ లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. హైదరాబాద్ లోని తన నివాసం ముందు గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు సోమవారం రెక్కీ నిర్వహించారని, వారిని పట్టుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అప్పగించామని లేఖలో తెలిపారు. అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసు విచారణకు సంబంధించిన విషయాలపై ఎలాంటి సమాచారం ఇప్పటివరకు రాలేదని, ఈ విషయం తనకు, తన కుటుంబ సభ్యుల భద్రతకు సంబంధించిన అంశమని లేఖలో పేర్కొన్నారు.

తనపై నిర్వహించిన రెక్కీని ఏపీ రాష్ట్ర క్యాడర్ లోకి తీసుకోవాలనుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తేలికగా తీసుకున్నారు అని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు స్టీఫెన్ రవీంద్ర మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తనకు వ్యక్తిగత భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయాలని చూస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేలా చూడాలని, సిపి స్టీఫెన్ రవీంద్ర పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news