హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్ధిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రీనివాస్‌కు కేసీఆర్ టికెట్ కేటాయించారు. అయితే శ్రీనివాస్‌కు రాజకీయ అనుభవం లేదు. ఈటలతో పోలిస్తే శ్రీనివాస్ రాజకీయంగా చాలా చిన్న నాయకుడు అనే చెప్పాలి. కానీ కేసీఆర్ అన్నీ తానై చూసుకుండటంతో హుజూరాబాద్ బరిలో శ్రీనివాస్ బరిలో దిగారు.
ఈ క్రమంలోనే సీనియర్ నేతగా ఉన్న ఈటలపై, రాజకీయాల్లో చాలా చిన్నోడైన శ్రీనివాస్ యాదవ్ నెగ్గగలరని ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి మీద పిల్లోడు నోముల భగత్ ఎలా గెలుస్తాడని చాలా మంది అనుకున్నారని, కానీ ప్రజలు భగత్‌ని గెలిపించారని చెబుతున్నారు. అలాగే మొదట్లో ఈటల కూడా టీడీపీలో బలంగా ఉన్న మద్దసాని దామోదర్ రెడ్డిని ఢీకొట్టి విజయం సాధించారని, ఇప్పుడు గెల్లు కూడా విజయం సాధిస్తారని అంటున్నారు.
అయితే దామోదర్ రెడ్డి టీడీపీ తరుపున వరుసగా నాలుగుసార్లు కమలాపూర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. అలాగే ఆయన మంత్రి కూడా పనిచేశారు. ఇలా బలమైన నేతపైన 2004లో ఈటల రాజేందర్ పోటీ చేశారు. అప్పుడు దామోదర్ రెడ్డిని ఓడించడం ఈటల వల్ల కాదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈటల విజయం సాధించారు.
ఇప్పుడు హుజూరాబాద్‌లో ఈటల వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇక ఆయనపై తొలిసారి గెల్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెల్లు గెలుపు అంతా సులువు కాదని ప్రచారం నడుస్తోంది. కానీ పిల్లోడైన గెల్లు, ఈటలకు చెక్ పెడతారని టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. మరి చూడాలి తలసాని చెప్పిన లాజిక్ ఏ మేర వర్కౌట్ అవుతుందో?