తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికలకు అతి త్వరలోనే ముహూర్తం ఖరారయ్యేలా కనిపిస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లోనే ఉపఎన్నికకు షెడ్యూల్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా హుజూరాబాద్‌లో మాత్రం హోరాహోరీ ఫైట్ జరిగేలా కనిపిస్తోందని తెలుస్తోంది.
ఓ వైపు టీఆర్ఎస్ అధికార బలంతో హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరవేయాలని చూస్తుంది. అటు తన సొంత బలం, హుజూరాబాద్ ప్రజలకు తన మీద ఉన్న నమ్మకం గెలిపిస్తాయని ఈటల రాజేందర్ విశ్వాసంతో ఉన్నారు. వారిద్దరి మధ్య ఓట్లు చీలిపోయి తమకు బెనిఫిట్ అవుతుందని కాంగ్రెస్ చూస్తుంది. అయితే ఏది ఎలా జరిగినా ఇక్కడ వాస్తవ పరిస్తితులని చూస్తే టీఆర్ఎస్, ఈటల మధ్య పోరు తీవ్రంగా జరిగేలా కనిపిస్తోంది.
మళ్ళీ ఇందులో ఈటల రాజేందర్ కే కాస్త గెలుపు అవకాశాలున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ఈటల గెలుపు అవకాశాలని దెబ్బకొట్టడానికి టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు హుజూరాబాద్‌లో సరికొత్త రాజకీయానికి తెరలేపుతూనే ఉంది. ఊహించని విధంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ప్రజలని తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ టీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసిన, ఎన్ని పథకాలు ఇచ్చి ప్రజలని ఆకట్టుకోవాలని చూసిన హుజూరాబాద్‌లో మాత్రం ఈటల బలాన్ని తగ్గించలేకపోతున్నారని తెలుస్తోంది.
ఈటలని టీఆర్ఎస్ మోసం చేసిందని, కాబట్టి తాము అండగా ఉంటామనే విధంగా హుజూరాబాద్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక తాజాగా పాదయాత్ర చేస్తున్న ఈటల అనారోగ్యానికి గురవ్వడం, ఆయన మోకాలుకు సర్జరీ జరగడం తెలిసిందే. ఈ అంశంపై కూడా టీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేసి, ఈటలపై ఇంకా సానుభూతి పెరిగేలా చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే హుజూరాబాద్‌లో రాజకీయం మారినా, అక్కడ ప్రజలు మాత్రం ఈటల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా హుజూరాబాద్‌లో ఈటలకు ప్రజాధరణ తగ్గట్లేదని చెప్పొచ్చు.