విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ రిజల్ట్‌పై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని ఆయన అన్నారు. మన యాక్షన్ పైనే ప్రేక్షకుల రియాక్షన్ ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

”సినిమా అనే కాదు ఏ విషయంలోనూ ఎగిరెగిరిపడొద్దు. అలా చేస్తే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయి. మేము ఎంతో కష్టపడి చిత్రాన్ని తెరకెక్కించాం. మా చిత్రాన్ని చూడండి” అంటూ ఏ చిత్రబృందమైన తమ సినిమాని ప్రేక్షకుల్లో ప్రమోట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకానీ, నువ్వు చిటికెలు వేస్తే.. ప్రేక్షకులు ఇలాంటి సమాధానమే చెబుతారు” అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

విలేకరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా పరాజయానికి కారణాలు ఏమై ఉంటాయి?’ అని ప్రశ్నించగా.. “ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. సాధారణంగా నేను పూరీ జగన్నాథ్ అభిమానిని. ఆయన సినిమాలంటే నాకెంతో ఇష్టం. కానీ, ‘లైగర్’ ట్రైలర్ చూసినప్పుడే చిత్రాన్ని చూడాలనిపించలేదు. ఒకవేళ భవిష్యత్తులో చూడాలనిపిస్తే చూస్తా” అని ఆయన చెప్పుకొచ్చారు.

బాయ్‌కాట్ ట్రెండ్‌పైనా తమ్మారెడ్డి పెదవి విప్పారు. సోషల్‌మీడియా ఆదరణ పెరుగుతోన్న కొద్దీ ఇలాంటి ట్రెండ్స్ ప్రారంభమవుతున్నాయని అన్నారు. అలాంటి ట్రెండ్స్‌ని మొదలుపెట్టేవారు నాకు తెలిసినంత వరకూ సరిగ్గా సినిమాలు కూడా చూడరు. కాబట్టి, అలాంటి వాటిని పట్టించుకోకపోవడమే బెటర్ అని ఆయన సమాధానమిచ్చారు.