దేశాన్ని పాలించే శక్తి ఇకపై కొత్త ముఖాలకు రానుంది అని ఎప్పటి నుంచో బీజేపీ విశ్వసిస్తోంది. ప్రథమ మహిళ పదవికి ద్రౌపదీ ముర్మూ ఎంపిక ద్వారా అదే ఆలోచనలను, అదే సంయుక్త నిర్ణయాలను వెలుగులోకి తెచ్చింది ఎన్డీఏ. నేషనల్ డెమొక్రటిక్ ఎలయెన్స్ పేరిట ఉన్న బీజేపీ సారథ్య కూటమి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం అయింది. ఈ నిర్ణయం ఇప్పటిది కాదని 2017లోనే ఇలాంటి నిర్ణయం ఒకటి వెలువరించాలని చూశారని, అప్పటి పరిస్థితుల రీత్యా సాధ్యం కాలేదని ఓ వాదన వినిపిస్తోంది.
మళ్లీ మళ్లీ వెంకయ్య నాయుడు (ఇప్పటి ఉప రాష్ట్రపతి) కి అవకాశాలు ఇవ్వడం తగని పని అని కూడా భావిస్తోంది బీజేపీ. ఇదే మాట నిన్నటి సాయంత్రం పార్లమెంట్ బోర్డు సమావేశం జరగక ముందరే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అండ్ కో చెప్పి ఉంటుంది అని సమాచారం. దీంతో వెంకయ్య నాయుడు ఆశలు ఆవిరయ్యాయి. కానీ ఆయనకు పోటీ చేయాలన్న ఆలోచనలే లేవని కొన్ని వర్గాలు ఇప్పుడంటున్నాయి.
మరోవైపు ద్రౌపదీ ముర్మూ ఎంపిక ద్వారా బహుజనులకు మరింత చేరువ కావచ్చన్న ఆలోచన కూడా బీజేపీకి ఉందని తెలుస్తోంది. ఇంతకాలం బీజేపీ ఓవర్గాన్ని దూరం చేసుకుందున్న లేదా చేసుకుంటుందన్న అభిప్రాయాన్ని చెరిపివేసే క్రమంలో భాగంగా తాజా నియామకం లేదా ప్రతిపాదన జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో మంచి మైలేజీ పొందవచ్చన్నది బీజేపీ ఆశ. ఇక మోడీని ఏనాటి నుంచో వ్యతిరేకిస్తూ వస్తున్నారు వెంకయ్య అని సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానిస్తూ అందుకే ఈ సారి అత్యున్నత పదవి విషయమై బీజేపీ కినుక వహించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఓ అప్రాధాన్య పోస్టు కారణంగా తనకు ఉనికి లేకుండా పోయిందని గతంలోనూ ఆయన కొన్ని సంభాషణల్లో పరోక్ష రీతిలో చెప్పి ఉన్నారు. కనుక మోడీ – షా ద్వయం అంత వేగంగా ఆయనకు మరో ఉన్నత పదవి అప్పగించరు కూడా ! ఉప రాష్ట్రపతిగా కొనసాగించే అవకాశాలు కూడా తక్కువే ! ఎలానూ రాష్ట్ర పతి పదవి గిరిజనులకు కేటాయించారు కనుక ఉప రాష్ట్రపతి పదవి మైనార్టీలకు కేటాయించే అవకాశాలే ఉన్నాయి. ఏదేమయినప్పటికీ బీజేపీ నిర్ణయంతో బాబుకు ఝలక్ తగిలింది. ఆయన కానీ ఆయన మీడియాకు కానీ ఆశించిన విధంగా రాష్ట్రపతి అభ్యర్థి పేరు లేకపోవడం తీవ్ర నిరాశకు కారణమే ! కనుక ఇప్పుడు చంద్రబాబు మద్దతు విపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఉంటుందా లేదా బీజేపీ కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు ఉంటుందా అన్నదే కీలకం.
వాస్తవానికి 3 ఎంపీలు, 23 ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి ఇప్పటికిప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశమే లేదు. ఆ అవకాశం రానున్న రెండేళ్లకూ వైసీపీకే ఉంది. కానీ ఎందుకనో వైసీపీ కూడా ఆ అధికారాన్నీ లేదా ఆ అవకాశాన్నీ వినియోగించుకోవడం లేదు అన్నది ఓ విమర్శ. బహుశా ! కేసులకు భయపడే జగన్ మోహన్ రెడ్డి వర్గం ఢిల్లీపెద్దలను ఢీ కొట్ట లేకపోతున్నదన్న వాదన టీడీపీ వినిపిస్తోంది. టీడీపీ వాదన ఎలా ఉన్నా తాజా పరిణామాలు మాత్రం చంద్రబాబుకు తీవ్ర నిరాశకు కారణం అయ్యేవే అన్నది సుస్పష్టం.