విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో పార్టీలు స్పీడ్ పెంచాయ్. టీడీపీ నుంచి మేయర్ పదవికి కేశినేని నాని కుమార్తె రేస్‌లో ఉందన్న ప్రచారంతో టీడీపీలో రెండు వర్గాలు విడిపోయి కొత్త పోరుకు తెరతీశారు తమ్ముళ్లు. ఆలు లేదు చూలు లేదు కాని కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా మారింది బెజవాడ టీడీపీ నేతల తీరు. ఇంకా మేయర్ ఎన్నికలు జరగలేదు.. పదవి కోసం రచ్చ చేసి బెజవాడ రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు.
బెజవాడ టీడీపీలో మేయర్ సీటు చిచ్చు రేపింది. ఎన్నికలు అవకముందే మేయర్ పీఠం టీడీపీకి రాక ముందే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్తాయికి చేరాయి. కేశినేని నాని కేంద్రంగా ఏ వివాదం ముదిరి పాకాన పడటం పార్టీ అధిష్టానానికి తలనొప్పి కడుతోంది. బెజవాడ మేయర్ సీటు కోసం కేశినేని వర్గం, కేశినేని వ్యతిరేక వర్గంగా విడిపోయారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధులతో సమావేశమైన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టిడిపి నేత నాగుల్ మీరా ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన నేతలు మేయర్ సీటు కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత మాత్రం కాదని కుండబద్దలు కొట్టేశారు.
విజయవాడ మేయర్‌ను చంద్రబాబు ఇంకా డిక్లేర్ చేయలేదని కేశినేని వ్యతిరేకవర్గం గట్టిగా ప్రచారం చేస్తోంది. పోయిన సారి మేయర్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థికి ఇచ్చారు ఈసారి సెంట్రల్ నియోజకవర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్న బోండా ఉమ. ఎంపీ కేశినేని మాత్రం తమ కుమార్తె మేయర్ అభ్యర్థి అంటూ సన్నిహితులతో చెబుతున్నారు. చంద్రబాబు ఎవరు మేయర్ అని చెబితే వారికే సపోర్ట్ చేస్తామని చెబుతున్నారు టీడీపీ కార్పొరేటర్లు.
అసలు ఎన్నికలు జరగకుండా. మేయర్ సీటు పై బెజవాడలో టీడీపీ నేతల రచ్చ చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల సమయంలో రాష్టంలో అధికారంలో ఉన్న టీడీపీ మేయర్ సీటు దక్కించుకుంది. ఇపుడు అంతా ఈజీ కాదనే.విషయాన్ని నేతలు గుర్తించకుండా మేయర్ సీటు కోసం రచ్చకెక్కటటం అధిష్టానం సీరియస్ గా తీసుకుందట. ఎన్నికల ఫలితాల బట్టి మేయర్ సీటు దక్కాక ప్రకటిద్దాం అనే వైసీపీ లైన్ ఫాలో అవుతోందట టీడీపీ.
కేశేనేని వర్గం, కేశినేని వ్యతిరేక వర్గంగా విడిపోయిన తమ్ముళ్లు మాత్రం మేయర్ తమదంటే తమదంటూ ఎన్నికలు పూర్తవ్వకముందే రచ్చ రేపుతున్నారు.