అవసరంలేని విషయాలపై టిడిపి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. బుధవారం గుంటూరు జిల్లాలో ఓ వినాయక మండపంలో జరిగిన పూజలో పాల్గొన్నారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. టిడిపి అవసరం లేని విషయాలపై రాద్ధాంతం చేస్తుందని.. తప్పుడు ఆరోపణలు చేస్తే చివరకు మీరే ఫూల్స్ అవుతారని అన్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని.. ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటీన్లను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్ల విషయంలో టిడిపి కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం చేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాలుగు క్యాంటీన్లు ఏర్పాటు చేసి రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని నెల రోజులుగా రాజకీయం చేసిందన్నారు. తప్పు చేసిన వ్యక్తులు ఎన్నో రోజులు తప్పించుకోలేరని అన్నారు.